శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:10:42

ఒకసారి సోకినవారికి మళ్లీ కరోనా

ఒకసారి సోకినవారికి మళ్లీ కరోనా

  • వైరస్‌ పోయిందన్న అపోహ ప్రమాదకరం
  • బాధితుల్లో రోగనిరోధకశక్తి తాత్కాలికమే 
  • వైరస్‌ స్వభావంలో ఎప్పటికప్పుడు మార్పు
  • వ్యాక్సిన్లు సక్సెస్‌ కావడం చాలా తక్కువ 
  • కొవిడ్‌ నియంత్రణలో తెలంగాణ సక్సెస్‌ 
  • ‘నమస్తే తెలంగాణ’తో ప్రముఖ ఫార్మకాలజిస్టు డాక్టర్‌ రఘురామ్‌రావు

దీర్ఘకాల రోగనిరోధశక్తి, శాశ్వత రోగ నిరోధకశక్తి వేర్వేరు. వైరస్‌ వల్ల ఏర్పడే రోగనిరోధకశక్తి తాత్కాలికమే. కాబట్టి రెండోసారి వైరస్‌ సోకే అవకాశాలున్నాయి. రెండోసారి ఇన్‌ఫెక్ట్‌ అయ్యేవారిలో పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చు. వైరస్‌ సోకిన వారు మళ్లీ తమకు రాదని నిర్లక్ష్యంగా ఉండటం, ఇప్పటివరకు రానివారు వైరస్‌ పోయిందిలే అని ఇష్టానుసారంగా తిరగటం మంచిదికాదు. 

-  ప్రముఖ ఫార్మకాలజిస్టు డాక్టర్‌ రఘురామ్‌రావు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేసిన కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, దాని స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతున్నదని ప్రముఖ ఔషధ పరిజ్ఞాన శాస్త్రవేత్త (ఫార్మకాలజిస్ట్‌), ప్రపంచంలో రెండు శాతంగా ఉన్న అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరైన  డాక్టర్‌ అక్కినెపల్లి రఘురామ్‌రావు పేర్కొన్నారు. ఒకసారి వైరస్‌ సోకినవారికి రెండోసారి రాదన్న అపోహ తగదని హెచ్చరించారు. వైరస్‌ వల్ల ఏర్పడే రోగనిరోధకశక్తి తాత్కాలికమేనని, కాబట్టి రెండోసారి వైరస్‌ సోకే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌పై వ్యాక్సిన్‌ ప్రభా వం చాలా తక్కువ అని వెల్లడించారు. ప్రజ ల వ్యవహారంపైనే సెకండ్‌ వేవ్‌, థర్డ్‌వేవ్‌ ఆధారపడి ఉంటాయని చెప్పారు. డాక్టర్‌ రఘురామ్‌రావు ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

కరోనా వైరస్‌ ఎక్కడ ఎలా పుట్టింది? 

ఈ మధ్య జీ-నోమ్స్‌లలో మానవ కల్పితాలు పెరిగిపోతున్నాయి. బయోవార్‌లకు జీనోమ్స్‌ను వాడుకుంటున్నారు. చైనాలో ఏదో చేయబోతే మరేదో జరిగిపోయినట్లు తెలుస్తున్నది. కరోనా వైరస్‌ మాత్రం జంతుజాలం లేదా మానవుల నుంచి సహజంగా పుట్టినట్లు కనిపిస్తలేదు. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. 

రెండోసారి సోకే అవకాశాలు ఎంత? 

రీ-ఇన్‌ఫెక్షన్‌ అనేది కచ్చితంగా ఉంటుం ది. ఇప్పటికే చాలా చోట్ల.. మన దేశంలో కూడా కరోనా సోకిన రోగులకు రెండోసారి రీ-ఇన్‌ఫెక్ట్‌ అయిన కేసులు చూస్తున్నాం. కరోనా సోకిన రోగిలో యాంటిబాడీస్‌ ఏర్పడి రోగనిరోధక శక్తి వస్తుందని, దీంతో ఒక్కసారి ఇన్‌ఫెక్ట్‌ అయిన వ్యక్తికి రెండోసారి మళ్లీ ఇన్‌ఫెక్ట్‌ కారనే అపోహ ప్రజల్లో నాటుకుపోయింది. కానీ అది తప్పు. దీర్ఘకాల రోగనిరోధశక్తి, శాశ్వత రోగ నిరోధకశక్తి అనేవి వేర్వేరు. వైరస్‌ వల్ల ఏర్పడే రోగనిరోధకశక్తి తాత్కాలికమే. కాబట్టి రెండోసారి వైరస్‌ సోకే అవకాశాలున్నాయి. మరో విషయమేంటంటే రెండోసారి ఇన్‌ఫెక్ట్‌ అయ్యేవారిలో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి. అందుకనే వైరస్‌ సోకిన వారు మళ్లీ తమకు రాదనే భ్రమతో నిర్లక్ష్యంగా ఉండడం, ఇప్పటివరకు రానివారు వైరస్‌ పోయిందిలే అని ఇష్టానుసారంగా తిరగడం ఏమాత్రం మంచిదికాదు. అది చాలా ప్రమాదకరం. 

టీకాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? 

బ్యాక్టీరియాకు టీకాలు చాలా ఉన్నాయి. కానీ వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు వ్యాక్సిన్‌లు పెద్దగా లేవు. కరోనా కూడా ఒక రకమైన వైరల్‌ ఇన్‌ఫెక్షనే. కరోనాపై వ్యాక్సిన్‌ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కరోనా వైరస్‌ అనేది కనీవినీ ఎరుగని ఇన్‌ఫెక్షన్‌. ఇది పూర్తిగా కొత్తది. దీనిపై ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఏది చెప్పినా ఊహాగానమే. వైరస్‌లపై వ్యాక్సిన్‌ సక్సెస్‌ కావడం చాలా తక్కువ. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ ప్రయోగం ఒక ప్రయత్నం మాత్రమే. 

తెలంగాణలో వైరస్‌పై మీ అభిప్రాయం

తెలంగాణ ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించి వైరస్‌ను కంట్రోల్‌ చేయడంలో  విజయవంతమైంది. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో కేసుల సంఖ్య, మరణాల రేటు చాలా తక్కువ. రికవరీ రేటు ఎక్కువగా ఉంది. ఇది శుభపరిణామం. ఇక్కడి ప్రభుత్వం, ప్రజల పరస్పర సహకారమని చెప్పవచ్చు. 

చివరగా ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? 

నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను కాబట్టి ఇక్కడి పరిస్థితులు గమనిస్తున్నాను. ప్రజల్లో నిర్లక్ష్యం తీవ్రంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. నేను రెండేండ్ల క్రితం జపాన్‌ వెళ్లాను. అక్కడ ప్రతి ఒక్కరు విధిగా మాస్క్‌ ధరించి ఉన్నారు. దీనిపై నేను ప్రశ్నించా. సాధారణంగా జపాన్‌లో విపత్తులు ఎక్కువ. వాటి వల్ల ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతూనే ఉంటాయట. అందుకని అక్కడి ప్రజలు మాస్క్‌ ధరించడాన్ని  తమ జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నారు. అది మనదగ్గర ఎక్కడా కనిపించకపోవడం బాధాకరం. కరోనా వైరస్‌ పోయిందని అందరూ అపోహ పడుతున్నారు. అది మొదటికే మోసమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొన్ననే కేరళను చూశాం.  ఇదొక్క ఉదాహరణ చాలు మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి. వైరస్‌ ఇంకా మన మధ్యనే ఉన్నదనే విషయాన్ని మరిచిపోతే మనల్ని మనం ఇక మరిచిపోవాల్సిందే. ముఖాలకు మాస్కు తప్పనిసరి. శానిటైజర్‌ కచ్చితంగా వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక శుభ్రతను పాటించాలి. ద్విచక్ర వాహనాలపై ముగ్గురేసి పోతున్నారు. ఒక వాహనంపై ఒకరే వెళ్లాలి. మరికొంత కాలం పండుగలు, సామాజిక కార్యక్రమాలను పరిమిత సంఖ్యలో జరుపుకోవడం మంచిది. ప్రజల్లో మార్పు రావాలి. లేకపోతే వైరస్‌లో మార్పు వస్తుంది. అది ప్రమాద ఘంటికలు మోగించే అవకాశాలు లేకపోలేదు.

వ్యాక్సిన్‌ ఎప్పటివరకు రావచ్చు? 

ఒక దేశంలో సక్సెస్‌ అయిన వ్యాక్సిన్‌ మరో దేశంలో సక్సెస్‌ కాకపోవచ్చు. అందుకు అక్కడి ప్రజల శరీరతత్వం, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలు ముడిపడి ఉంటాయి. వైరస్‌ ఒక దేశంలో ఒకలా మరో దేశంలో మరోలా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.  2021లో వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. 

మన దగ్గర సెకండ్‌ వేవ్‌ వస్తుందా? 

సెకండ్‌ వేవ్‌ మన దేశంలో అనుకున్నంత తీవ్రంగా ఉండకపోవచ్చు. ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయమే. మొదటి నుంచి వైరస్‌ తీవ్రత మన దగ్గర తక్కువే. ఇక్కడి వాతావరణం దృష్ట్యా లేదా జన్యుపరంగా కావచ్చు ఇతర దేశాల కంటే బలహీనమనే చెప్పాలి. మరో ముఖ్య విషయమేంటంటే సెకండ్‌ వేవ్‌, థర్డ్‌వేవ్‌ అనేది ప్రజల వ్యవహారంపై ఆధారపడి ఉంటుంది.