బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:56:12

రాష్ట్రమంతా ఆదర్శ గ్రామాలే

రాష్ట్రమంతా ఆదర్శ గ్రామాలే

  • ‘పల్లె ప్రగతి’తో కొత్త రూపు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన గొప్పది
  • ఊరూరా వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు
  • పల్లెల్లో మెరుగైన ఆరోగ్య ప్రమాణాలు
  • ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌, జనవరి 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలోని అన్ని ఊర్లనూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని అమలు చేస్తున్నదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ‘పల్లె ప్రగతి’కి ముందు మల్కాపూర్‌, గంగదేవిపల్లి వంటి ఊర్లను ఆదర్శ గ్రామాలుగా చెప్పుకొనేవాళ్లమని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఊరు ఆదర్శ గ్రామంగానే మారిందన్నారు. గ్రామాల సమగ్ర వికాసమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ‘పల్లె ప్రగతి’తో గొప్ప ఫలితాలు వచ్చాయని తెలిపారు. ‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లో మెరుగై న పరిస్థితులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా..

నమస్తే: ‘పల్లె ప్రగతి’తో పరిస్థితులు మెరుగుపడ్డాయా?

మంత్రి ఎర్రబెల్లి: చాలా వరకు మెరుగుపడ్డాయి. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు మౌలిక వసతులు కల్పించాం. చెత్తాచెదారం కన్పించడం లేదు.  

నమస్తే: ‘పల్లె ప్రగతి’ నిరంతరమా?

ఎర్రబెల్లి: 2019 సెప్టెంబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 5 వరకు మొదటి విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం జరిగింది. ఇది నిరంతరం కొనసాగాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గ్రామాల్లోని పనులకు సంబంధించిన మిగిలిన ప్రభుత్వ శాఖల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. మిషన్‌ భగీరథతో ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీరందిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది. సీజనల్‌ వ్యాధుల గండం తప్పింది. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న పరిస్థితుల్లోనూ ప్రజలకు ఆరోగ్యపరంగా మేలు చేశాయి. 

నమస్తే: పంచాయతీరాజ్‌ కొత్త చట్టంతో ప్రయోజనం కలిగిందా?

ఎర్రబెల్లి: పంచాయతీరాజ్‌ కొత్త చట్టంతో గ్రామీణ వ్యవస్థను పూర్తిస్థాయిలో మార్చివేశాం. ప్రతి మండలానికి ఒక ఎంపీవోను, ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాం. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాం. పల్లెల్లో మెరుగైన వసతులు కల్పించాం. పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు జరిగేలా చూశాం. ఇలా సమూల మార్పులతో కార్యక్రమం విజయవంతమైంది.

నమస్తే: ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంది?

ఎర్రబెల్లి: పల్లె ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేసేలా ప్రతి గ్రామ పంచాయతీలో నాలుగు స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశాం. ప్రజలు ఊరి అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఎక్కువ మంది స్వచ్ఛందంగా పాల్గొని శ్రమదానం చేశారు. గ్రామాల్లోని పాత ఇండ్లు, పడావు బావులు ఇప్పుడు కన్పించడం లేదు.  

నమస్తే: అన్నిచోట్లా వైకుంఠధామాల నిర్మాణం జరిగిందా?

ఎర్రబెల్లి: ప్రతి గ్రామంలో కచ్చితంగా వైకుంఠధామాలు నిర్మిస్తున్నాం. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక ఆలస్యమవుతున్నది. మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో  6,427 వైకుంఠధామాల నిర్మాణం పూర్తయింది. ఇందులో 4,509 పూర్తిగా వినియోగంలోకి వచ్చాయి. 11,641 పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల నిర్మాణం పూర్తయ్యింది.  

నమస్తే: హరితహారం కొనసాగుతుందా?

ఎర్రబెల్లి: పచ్చదనాన్ని పెంచే హరితహారం నిరంతర ప్రక్రియ. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏ రోడ్డు వెంట చూసినా మొక్కలు, చెట్లతో నిండిపోయి ఆహ్లాదకరంగా ఉంటుంది. దారిపొడవునా పచ్చదనమే కన్పిస్తుంది. నాటిన మొక్కలు 100 శాతం బతికేలా చర్యలు తీసుకున్నాం. 2019-20లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 10.96 కోట్ల మొక్కలు నాటితే వాటిలో 9.94 కోట్ల మొక్కలు బతికాయి. ప్రస్తుత ఏడాదిలో 12.67 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే 13.57 కోట్ల మొక్కలను నాటాం. వీటన్నింటిని సంరక్షించేలా ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం 15,646 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు అక్కడ ఫొటోలు దిగుతున్నారు. మరో 14,027 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాలను గుర్తించాం.

నమస్తే: నిధుల కేటాయింపు ఎలా?

ఎర్రబెల్లి: ‘పల్లె ప్రగతి’లో భాగంగా గ్రామాల్లో చేపట్టే పనుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.339 కోట్లను విడుదల చేస్తున్నది. ఈ నిధులు పంచాయతీలకు నేరుగా అందుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం కలిపి 2020-21లో ఇప్పటివరకు రూ.3078.95 కోట్లు విడుదలయ్యాయి. 


logo