గురువారం 04 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:45:53

కొవిడ్‌ బాండ్లు

కొవిడ్‌ బాండ్లు

  • నల్లధనాన్ని వెలికి తీసేందుకు,ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 
  • రాష్ర్టాలకు భారీ ప్యాకేజీ ఇవ్వాలి
  • క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌.. హెలికాప్టర్‌ మనీతో కూడా సంక్షోభానికి పరిష్కారాలు
  • నమస్తే తెలంగాణతో ఆర్థిక నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షో భం నుంచి బయటపడేందుకు కేంద్రం కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలని, సృజనాత్మక విధానాలను అమలుచేయాలని ప్రముఖ ఆర్థికవేత్త, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించినట్టుగా క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాప్టర్‌ మనీతోపాటు ‘కొవిడ్‌ బాండ్ల’ ను ప్రవేశపెట్టాలని  ‘నమస్తే తెలంగాణ’కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 

కరోనా వల్ల నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఏ కోణంలో చూడాలి? 

గతంలో 1991, 1997, 2008లో మన దేశం ఆర్థిక సంక్షోభాలను చవిచూసింది. కానీ ప్రస్తుత సమస్య అసాధారణమైనది. వాణిజ్య, వ్యాపార కార్యకలాపా లు స్తంభించాయి. ఈ  గడ్డుపరిస్థితి నుంచి బయటపడటం చాలాపెద్ద సమస్యే. 

సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి? 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే. విపత్తు నిర్వహణ నిధి నుంచి ఖర్చు చేసుకునే వెసులుబాటు రాష్ర్టాలకు కల్పించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద నిధులను విడుదలచేసింది. ఇంతవరకు జీడీపీలో 0.8శాతం వరకు మాత్రమే కొవిడ్‌ రిలీఫ్‌గా ప్రకటించింది. కానీ కరోనాను నిర్మూలించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడటానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న రాష్ర్టాలకు ఇంతవరకు భారీ ప్యాకేజీ ప్రకటించలేదు. నిర్దిష్ట ఆదాయంలేని అసంఘటితరంగ కార్మికులు దాదాపు 80శాతం మంది ఉంటారు. వారి బాగోగులు చూడటం రాష్ర్టాలకు భారంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించాలని రాష్ర్టాలు కోరుతున్నాయి. 

ఆర్థికవేత్తగా మీరు సూచించే పరిష్కార మార్గాలేమిటి ? 

కేంద్రం రాష్ర్టాలకు ప్రత్యేక ప్యాకేజీలిచ్చి అండగా నిలవాలి. మన సీఎం కే చంద్రశేఖర్‌రావు సూచించినట్లు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ విధానంతోపాటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 నుంచి 5 శాతానికి తక్షణం పెంచాలి. 1997లో ఏషియన్‌ ఎకనామిక్‌ క్రైసిస్‌ వచ్చింది. అప్పట్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న జపాన్‌ క్వాంటిటేవివ్‌ ఈజింగ్‌ విధానాన్ని అమలుచేసింది. జపాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ద్వారా బాండ్లు కొనుగోలుచేసి ద్రవ్యనిల్వలను వినియోగంలోకి తెచ్చింది. ఈ విధానంలో ఆర్‌బీఐ బహిరంగ మార్కెట్‌ ద్వారా దీర్ఘకాలిక సెక్యూరిటీలను కొంటుంది. వాణిజ్య బ్యాంకులకు డబ్బులిస్తుంది. తద్వారా వాణిజ్య బ్యాంకులకు అప్పులిచ్చే స్తోమత పెరుగుతుంది. 

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడం వల్ల బ్యాంకులకు వెసులుబాటు కలుగుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో రుణాలు లభిస్తాయి. దీనిద్వారా మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఫలితంగా ప్రజలలో కొనుగోలుశక్తి పెరిగి ఉత్పత్తయిన వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. డిమాండ్‌, సప్లయ్‌కి మధ్య కొంత సమతుల్యత ఏర్పడుతుంది. ఇక మన సీఎం కేసీఆర్‌ సూచించినట్లు హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అమలుచేయాలి. ఎందుకుంటే క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ ద్వారా బ్యాంకులలో నగదు నిల్వలు పెరిగి వాణిజ్య, వ్యాపార అవసరాలకు రుణాలు అందుబాటులోకి వస్తాయి. 

తద్వారా ఎకనామిక్‌ యాక్టివిటీ పెరుగుతుంది. కానీ అదే సమయంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదల జేబులకు కూడా కొంత డబ్చు చేరాలి. హెలికాఫ్టర్‌ మనీ విధానంలో ఒకసారి.. అది కూడా పరిమితంగా కరెన్సీని ముద్రించి పేదల ఖాతాలో కొంత జమచేసే విధంగా చర్యలు తీసుకుంటే వారు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుని సమాజంలో ఆర్థిక సమతుల్యత ఏర్పడుతుందనేది మన సీఎం ఆలోచన. ఒక్కసారి ఈ విధానాన్ని అమలుపరచడం వల్ల నష్టం ఉండదు. ఇక క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌లో ఒకసారి అందుబాటులోకి వచ్చిన ద్రవ్యం పరిస్థితి చక్కబడ్డ తర్వాత మళ్లీ బ్యాంకులకు వెళ్తుంది. హెలికాప్టర్‌ మనీలో ఆర్‌బీఐ అనుమతినిస్తే కేంద్ర ప్రభుత్వం కొంత కరెన్సీని ముద్రించి బ్యాంకుల ద్వారా పంపింగ్‌చేస్తుంది. ఇది మార్కెట్‌లోకి వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగిరాదు. కానీ  ఉత్పత్తయిన వస్తువులకు గిరాకీ పెరిగి ఆర్థిక సమతుల్యత సాధించడానికి చివరి అస్త్రంగా పనిచేస్తుంది.

కానీ ఈ చర్యల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందంటున్నారు కదా? 

ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందనడం అపోహ మాత్రమే. ఎందుకంటే నగదు అందుబాటులోకి వచ్చినా.. వస్తువుల ఉత్పత్తి, సరఫరా లేకపోతే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. సప్లయ్‌ లేక ఉన్న వస్తువులకు గిరాకీ పెరిగి రేట్లు అసాధారణంగా నింగినంటుతాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కరోనా రాకముందే డిమాండ్‌ పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మన వద్ద వస్తువులు, సరుకుల లభ్యత ఉన్నది. మనీ సర్క్యులేషన్‌ పెరగాలి. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు, యంత్ర సామగ్రి దెబ్బతిన్నప్పుడు ఉత్పత్తి కుంటుపడి వస్తువులు, సరుకులు సకాలంలో అందుబాటులోకి రావడం కష్టంగా మారుతుంది. కానీ మన దగ్గర నగదు నిల్వలు పెరిగిన వెంటనే ఉత్పత్తి పెరిగి వస్తువులు అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణ తొందరగానే కోలుకునే అవకాశమున్నది. ఇప్పటికే మన రాష్ట్రం గణనీయంగా వ్యవసాయ ఉత్పత్తులను సాధించింది. జీఎస్డీపీలో మన వ్యవసాయరంగం వాటా 15 శాతానికి పెరిగింది. కాబట్టి ద్రవ్యోల్బణం అనే పరిస్థితి రాదు. వాస్తవానికి వాణిజ్యబ్యాంకుల వద్ద ప్రభుత్వ సెక్యూరిటీలు రూ.34.78 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. ఇది మొత్తం దేశ జీడీపీలో 18శాతం. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ మనీలో ఇప్పుడు మనం అడుగుతున్నది కేవలం పది లక్షల కోట్లే. అంటే జీడీపీలో కేవలం 5శాతం మాత్రమే. 

కొవిడ్‌ బాండ్లు అంటే ఏమిటి ?

నల్లధనం ఉన్నవారు కొంత పెనాల్టీ చెల్లించి దానిని తెల్లధనంగా మార్చుకోవచ్చని కేంద్రం పలుమార్లు స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ప్రకటించింది. కానీ అపరాధరుసుం భారీగా ఉండటంవల్ల చాలామంది తమవద్దనున్న నల్లధనాన్ని వెల్లడించడానికి ముందుకురాలేదు. 2019లో 15వ ఆర్థిక సంఘం మన రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ కూడా ఇదే సలహా ఇచ్చారు. పెనాల్టీని తగ్గిస్తే చాలామంది లెక్కల్లో చూపని ఆదాయాన్ని వెల్లడించే అవకాశమున్నదని సూచించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ ఆపదకాలాన్ని సువర్ణావకాశంగా ఉపయోగించుకోవాలి. నల్లధనాన్ని వైట్‌మనీగా మార్చుకోవాలనుకునేవారికోసం కొవిడ్‌ బాండ్ల కొనుగోలు పథకాన్ని ప్రకటించాలి.  స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక బాండ్లకు ఒక్కో విధంగా పెనాల్టీ విధించాలి. స్వల్పకాలానికి ఎక్కువ పెనాల్టీ దీర్ఘకాలానికి తక్కువ పెనాల్టీ విధించి వెసులుబాటు కల్పించాలి. నిర్దిష్ట కాలం పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి వాపసు వస్తుందన్న నమ్మకం కలుగుతుంది. దీంతో విదేశాలలో, స్వదేశంలో చెలామణిలో లేకుండా నిరుపయోగంగా ఉన్న నల్లధనం వినియోగంలోకి వస్తుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావనే సందేహాలున్నాయి..

అది కూడా అపోహనే. 2008లో ఆసియా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మన దేశంలో ఏ సమస్యా లేదు. అయినప్పటికీ ఆర్థిక వెసులుబాటు కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 0.5 శాతం పెంచింది. 2009-10లో కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఎఫ్‌ఆర్‌బీఎంను ఒక శాతం నుంచి 3 శాతానికి పెంచింది. 2008లో వచ్చిన సంక్షోభానికి ఇప్పటి పరిస్థితికి చాలాతేడా ఉంది. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ వంటి వారు ఎఫ్‌ఆర్‌బీఎంను కేవలం 2 శాతం మాత్రమే పెంచాలని సూచించారు. దీనిద్వారా రాష్ర్టాలు రెండు శాతం అదనంగా రుణాలు తీసుకోవడానికి వీలుంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటే రాష్ర్టాలపై పెద్ద భారం కూడా ఉండదు. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయానికి వస్తే ద్రవ్యలోటు పెంచడం వారికి సమస్య కాదు. ఎందుకంటే ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు.


logo