బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 05, 2020 , 01:41:40

ప్రజారక్షణకే తొలి ప్రాధాన్యం

ప్రజారక్షణకే తొలి ప్రాధాన్యం

  • సీఎం కేసీఆర్‌ ముందుచూపుతోనే కరోనా కట్టడి
  • ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో సత్ఫలితాలు 
  • లాక్‌డౌన్‌కు ప్రజల సహకారం బాగుంది 
  • ‘మర్కజ్‌'ను దేశానికి చెప్పింది తెలంగాణనే 
  • అది లేకపోతే వైరస్‌ కంట్రోల్‌ అయ్యేది
  • ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా రక్కసి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటంపైనే తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ప్రభుత్వం ముందుగానే లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అతి పెద్ద ఉపద్రవం తప్పిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇవ్వడంతో లాక్‌డౌన్‌లో ప్రజలకు నిత్యావసరాల కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వైరస్‌ ప్రమాదంనుంచి తెలంగాణ బయటపడుతుందనుకున్న దశలోనే ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన మతప్రార్థనల వ్యవహారం కరీంనగర్‌లో వెలుగుచూసిందని, ఈ విషయాన్ని తొలుత దేశానికి తెలియజేసింది కూడా తెలంగాణనే అని చెప్పారు. తెలంగాణ ప్రజలు చైతన్యంగా ఆలోచించారని, లాక్‌డౌన్‌కు బాగా సహకరించారని ప్రశంసించారు. శనివారం సోమేశ్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఇవి..

ప్రశ్న: కరోనా అనుమానితులను ఎలా ట్రాకింగ్‌ చేశారు? 

జవాబు: కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవాళ్లను గుర్తించి స్వీయ నిర్బంధం చేస్తున్నాం. లాక్‌డౌన్‌ వల్ల వైరస్‌ కట్టడయింది. అంతా క్లియర్‌ అవుతుందనుకున్న సమయంలో మర్కజ్‌ వెళ్లి వచ్చిన వాళ్ల విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌లో ఇండోనేషియా వాసులను గుర్తించి చర్యలు తీసుకున్నాం. దీనివల్లే ఢిల్లీ మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో విదేశీయులున్నారని, వారితో ప్రార్థనల్లో పాల్గొన్నవారికి కూడా కరోనా లక్షణాలు ఉన్న విషయాన్ని ముందుగా దేశానికి తెలిసింది. ఇప్పుడు వస్తున్న కేసుల్లో 75 శాతం అవే ఉన్నాయి.

ప్ర: ఒక వ్యక్తి ఎంతమందికి వైరస్‌ను వ్యాప్తి చేయడానికి కారణం అవుతున్నారు? 

జ: ఒక వ్యక్తి ద్వారా 10 నుంచి 13 మందికి వైరస్‌ వ్యాప్తి అయ్యే అవకాశం ఉన్నదని భావిం చి ట్రాకింగ్‌ చేస్తున్నాం. ఎక్కువగా వారి కుటుంబసభ్యులే బాధితులవుతారు. కరోనా పాజిటివ్‌ వచ్చినవాళ్లు ఎక్కడినుంచి ఇంటికి ఎలా వచ్చారనే సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఎవరెవరిని కలిశారో తెలుసుకొనేందుకు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నాం. 

ప్ర: దేశంలో అందరికంటే ముందుగా తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించారు? ప్రమాదాన్ని ఏ స్థాయిలో అంచనా వేశారు? 

జ: సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగాం. మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు మినహా మిగతా అంతా దాదాపు కంట్రోల్‌కు వచ్చింది. మనం మార్చి రెండో వారం నుంచే కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు ప్రారంభించాం. రాష్ట్రంలో ఆంక్షలు మొదలైన తర్వాతే ఢిల్లీలోని మర్కజ్‌లో మీటింగ్‌ జరిగింది. మర్కజ్‌ మినహాయిస్తే రాష్ట్రంలో వైరస్‌ కట్టడి బాగా జరుగుతున్నది.

ప్ర: నిత్యావసరాల కొరత రాకుండా ఏం చర్యలు చేపట్టారు?

జ: నిత్యావసరాల సరఫరాకు కమిటీని ఏర్పాటుచేసి మానిటరింగ్‌ చేస్తున్నాం. ధరలు పెరుగకుండా, కొరతలేకుండా చూస్తూ.. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నాం. 

ప్ర: ఇతర రాష్ర్టాలు, దేశాల్లో ఉన్నవాళ్లకు ఇబ్బందిరాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు?

జ:తెలంగాణవాళ్లు చాలామంది ముంబయి, బీవండి తదితర ప్రాంతాల్లో ఉన్నారు. మన సచివాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశాం. అక్కడినుంచి ఫోన్లు రాగానే ఆ రాష్ట్ర అధికారులకు తెలియజేస్తున్నాం. వాళ్లు మనోళ్లను కలిసి సమస్య పరిష్కరిస్తున్నారు. 

ప్ర: లాక్‌డౌన్‌లో రైతులు తమ గ్రామాలకు ఇతరులను రానివ్వడంలేదు? ధాన్యం ఎలా కొంటారు?

జ: ప్రతి ధాన్యం గింజను గ్రామాల్లోనే కొంటామని సీఎం కేసీఆర్‌ చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామాల శివారులో వేసిన కంచెను తొలగించాలని కోరారు. తెలంగాణ మినహా ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. 

ప్ర: పంట కొనుగోలుకు, మిల్లింగ్‌కు కూలీల కొరతను ఎలా అధిగమిస్తారు?

జ: కొంత మేర కూలీల కొరత ఉన్నది. రైస్‌ మిల్లర్లతో మాట్లాడాం. ఇతర రాష్ర్టాల్లో ఉన్నవారు ఇక్కడకు వచ్చేందుకు సాయంచేస్తాం. కూలీలతో ఈ నెల 14 తరువాతనే ఎక్కువ పని ఉండే అవకాశం ఉన్నది. లాక్‌డౌన్‌ పూర్తయితే కూలీలు సులువుగా వస్తారు.

ప్ర: లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత మార్కెట్లు   తెరుస్తారా?

జ: 14వ తేదీన లాక్‌డౌన్‌ ముగిశాక కూడా ప్రజలు ఒకేచోట గుమిగూడకుండా నియంత్రిస్తాం. మార్కెట్లు తెరవాలా? వద్దా? అనేది అప్పటి పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ప్ర: రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది? లాక్‌డౌన్‌ తరువాత పరిస్థితి ఏమిటి?

జ: లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం లేదు. వ్యవసాయ కార్యక్రమాలు బాగా నడుస్తున్నాయి. ఆదాయం లేని ఈ పరిస్థితుల్లో ఏది అత్యవసరమైతే అది చేపడుతాం. ప్రజలను కాపాడటం కోసమే ఈ చర్యలు తీసుకున్నాం. ఐటీ కంపెనీలు ‘ వర్క్‌ఫ్రం హోం’ చేయిస్తున్నాయి. దీనివల్ల కొంతమేర ఆదాయం వస్తుంది. మనమే కాదు.. ప్రపంచమంతా నష్టాల్లోనే ఉన్నది. ఎవరూ చనిపోకుండా చూడటమే మన ప్రథమ లక్ష్యం. ప్రజలు సురక్షితంగా ఉంటే ఆ తర్వాత కష్టపడి పనిచేస్తే ఆర్థిక కార్యకలాపాలు చేయవచ్చు.

 వైద్యులకు ప్రభుత్వ సహకారం 

వైద్యులందరికీ సాధ్యమైనంత సహకారాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పారు. శనివారం సచివాలయం నుంచి కొవిడ్‌-19 బాధితులకు సేవలు అందిస్తున్న డాక్టర్లు, ప్రయోగశాలల టెక్నీషియన్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తమ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలల యాజమాన్యాలతో కూడా ప్రత్యేక టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు, ప్రయోగశాలల అధిపతులు, అధికారులు, సీసీఎంబీ డైరెక్టర్లకు సీఎస్‌ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.

ప్ర: లాక్‌డౌన్‌ విజయవంతం కావడానికి ఏం చర్యలు తీసుకున్నారు.?

జ: సీఎం ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి, టైం టు టైం మార్గదర్శకాలు ఇచ్చారు. సీఎస్‌, డీజీపీ, సీనియర్‌ అధికారులమంతా టీంగా కమిట్‌మెంట్‌తో పనిచేశాం. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర పరిపాలనాధికారులు సమన్వయంతో స్థానిక పోలీసులతో కలిసి పనిచేశారు. ప్రజలు లాక్‌డౌన్‌కు బాగా సహకరించారు. రాత్రి 7 గంటల తరువాత ఒక్కరు కూడా బయటకు రావడంలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో పేదలకు 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు ఇస్తున్నారు. ఇతర రాష్ర్టాల వలస కూలీలు, నిలువనీడ లేనివారికి రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.


logo