శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 02:59:37

అట్టడుగు వర్గాలకు భరోసా

అట్టడుగు వర్గాలకు భరోసా

  • సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా
  • ‘గ్రేటర్‌'లో గులాబీ జెండా ఎగిరేలా కష్టపడుతా
  • ‘నమస్తే తెలంగాణ’తో బస్వరాజు సారయ్య 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని, ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వడమే ఇందుకు నిదర్శమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య అన్నారు. ఈ సందర్భంగా సారయ్య ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. అత్యంత వెనుకబడిన వర్గాల్లోని రజక సామాజికవర్గాన్ని గుర్తించడమే అరుదని, అలాంటిది తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్న సారయ్య.. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న ఆదర్శ ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా కష్టపడతానని పేర్కొన్నారు.

నమస్తేతెలంగాణ: ఎమ్మెల్సీగా నామినేట్‌ కావడంపై ఎలా ఫీలవుతున్నారు?

బస్వరాజు సారయ్య: మొదట సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు. అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన నన్ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉన్నది. దక్షిణభారతంలోనే రజక కులం నుంచి ఎంపికైన మొదటి వ్యక్తిని నేనే. మమ్మల్ని గుర్తించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా.

మీ భవిష్యత్‌ ప్రణాళిక ఏమిటి?

సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తా. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా అందరి సహకారంతో నెరవేరుస్తాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొనిపోయి పార్టీని బలోపేతం చేస్తా.

మీ ఎంపికపై ఎలా స్పందిస్తారు?

నేను మొదటినుంచి తెలంగాణవాదిని. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా పనిచేశాను. తెలంగాణ రాష్ర్ట సాధనకు వందలమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. వారందరికీ న్యాయం చేసే దిశలో కేసీఆర్‌ ముందుకు పోతున్నారు. అణగారిన వర్గాలను రాజకీయంగా అవకాశం కల్పించాలనే సంకల్పంతోనే నన్ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేశారు.

ఎమ్మెల్సీగా మీ పాత్ర ఎలా ఉంటుంది?

టీఆర్‌ఎస్‌లో నాకు అరుదైన అవకాశం వచ్చింది. నిజంగా ఇది గొప్ప అనుభూతి. టీఆర్‌ఎస్‌కు ఎన్నికలు కొత్త కాదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా శిరోధార్యంగా భావించి పనిచేస్తా. హైదరాబాద్‌, వరంగల్‌లోనూ మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం. 

మీ విధేయతతోనే పదవి దక్కిందా?

నా ఎంపికతో ఒకటే స్పష్టమైంది. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీని, నాయకత్వాన్ని నమ్ముకొంటే ఫలితం తప్పక ఉంటుంది. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేసుకొంటూపోతే ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది. నా ఎంపిక అట్టడుగు వర్గాల్లో భరోసా నింపింది. ఏ పార్టీ గుర్తించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అట్టడుగు వర్గాలను పైకి తేవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ముందుకువెళ్తా. టీఆర్‌ఎస్‌లోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుంది.