గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 00:14:10

పీవీనే ఓ చరిత్ర..

పీవీనే ఓ చరిత్ర..

  • గుండి విష్ణుప్రసాద్‌తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ

‘పీవీ నరసింహారావు చరిత్రలో మిగిలిపోవడం కాదు. ఆయనే ఓ చరిత్ర. ఎన్ని విద్యలను నేర్చినా.. ఉన్నత పదవులను అధిరోహించినా మూలాలను మరచిపోని అసాధారణ వ్యక్తి’ అని ఐసీఐసీఐ బ్యాంకు విశ్రాంత ప్రాంతీయ అధికారి గుండి విష్ణుప్రసాద్‌ పేర్కొన్నారు. పీవీతో తన తాత, రాజర్షి గుండి రాజన్నశాస్త్రికి ఉన్న అనుబంధాన్ని, బ్యాంకింగ్‌ రంగంలో దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. 

పీవీతో మీ కుటుంబానికి ఉన్న అనుబంధం.. 

ధర్మపురికి చెందిన ప్రముఖ వేద పండితుడైన మా తాత రాజన్నశాస్త్రి అంటే పీవీకి ఎంతో భక్తిప్రపత్తులు ఉండేవి. మా తాత వేద, పురాణ, జ్యోతిష, సంగీత, సాహిత్య కళారంగాల్లో విద్వాంసుడు. అపర వేదవ్యాస మహర్షిగా పేరు పొందిన బ్రహర్షి, రాజయోగి. సంస్కృతాంధ్ర భాషాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. ఆయనను కలుసుకునేందుకు పీవీ తరచుగా వస్తుండేవారు. ఆయన భాగవత ప్రవచనాలను వినేవారు. తన ధర్మ సందేహాలను తీర్చుకునేవారు. సంస్కృతాంధ్ర భాషాభివృద్ధికి మా తాత చేసిన కృషి అంటే పీవీకి ఎంతో అభిమానం. మా తాత చొరవతో రూపొందిన సంస్కృతాంధ్ర డిగ్రీ ప్రాచ్య కళాశాలను 1966లో పీవీయే ప్రారంభించారు. ఈ విషయాలన్నీ మా నాన్న ముకుందశాస్త్రి చెప్తుండేవారు. పీవీ నరసింహారావు ఔన్నత్యం, గొప్ప మనసు, నిరాడంబరత గురించి చిన్నతనం నుంచే మాకు ఎంతో గొప్పగా వివరిస్తుండేవారు. చదువు, సాహిత్యాభిలాష తదితర అంశాల్లో ఆయనను ఉదాహరణగా చూపేవారు. అలా మొదటినుంచీ పీవీపై నాకు ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పలుసార్లు ఆయనను కలిశాను. 

పీవీతో మీకు మరచిపోలేని జ్ఞాపకం.. 

ఉద్యోగరీత్యా నేను వైజాగ్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా పీవీని కలియడం మరిచిపోలేని సంఘటన. ఒకరోజు ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నప్పుడు ఎప్పుడూ లేని విధంగా చాలామంది పోలీసులు కనిపించారు. ఎందుకని ఆరాతీయగా.. పీవీ తాను రచించిన ఇన్‌సైడర్‌ పుస్తకం తెలుగు అనువాదం ‘లోపలి మనిషి’ని ఆవిష్కరించేందుకు వచ్చారని తెలిసింది. ఆనందం వేసింది. ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నా. కానీ అపాయింట్‌మెంట్‌ లేకపోవడంతో పోలీసులు ఆపివేశారు. కానీ అనుకోకుండా నాకు తెలిసిన అధికారి ఒకరు కనిపించి నన్ను లోపలికి తీసుకెళ్లారు. నేను నా పేరు, ఫలానా వారి మనవడిని అని ఒక కాగితంపై రాసి పీవీ సెక్రటరీకి ఇచ్చాను. ఆ కాగితం అందుకున్న వెంటనే పీవీ గది లోపల ఉన్న వారిని బయటకు పంపించి నన్ను ఆహ్వానించారు. ఆప్యాయంగా పలకరించారు. తరువాత చెప్పులు పక్కకు విడిచి సుమారు ఐదారు నిమిషాలపాటు మౌనంగా నిలబడిన చోటనే ధ్యానం చేశారు. మా తాతగారిని స్మరించారు. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మరచిపోలేను. తరువాత మా నాన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆప్యాయత, ఆదరణకు మైమరచిపోయాను.  

బ్యాంకింగ్‌ రంగం అభివృద్ధికి పీవీ చేసిన కృషి..

ఒకరకంగా చెప్పాలంటే పీవీ వల్లే నాకు ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం లభించిందనవచ్చు. అదెలాగంటే పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితం. 1992 వరకు దేశంలో ప్రైవేట్‌ బ్యాంకులు లేవు. మరోవైపు జాతీయ బ్యాంకులన్నీ పూర్తి సంక్షోభంలో ఉన్నాయి. నిల్వలు లేవు. నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ మదింపు పద్ధతులు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేవి కావు. దీంతో విదేశాలకు మనపై ఎంతో అనుమానం ఉండేది. పీవీ వాటన్నింటినీ పరిష్కరించారు. బ్యాంకుల పనితీరును అంచనా వేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను అమలులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రైవేట్‌ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. దానికీ కొన్ని షరతులు విధించారు. అందులో ప్రధానంగా మూడు ముఖ్యమైనవి. అవి.. మూలధనం 100కోట్లు పెట్టాలి. పూర్తిగా కంప్యూటరైజ్డ్‌ సేవలను అందించాలి. మూడేండ్ల లోపల పబ్లిక్‌ లిస్టింగ్‌కు వెళ్లాలి. అలా 1994లో మా ఐసీఐసీఐతోపాటు మరికొన్ని బ్యాంకులు ఏర్పడ్డాయి. నేను 1995లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరాను. పీవీ వల్లే బ్యాంకింగ్‌ రంగం వేగం పుంజుకుంది. లాభాల బాటలో పయనించింది.

ఇంటర్యూ: మ్యాకం రవికుమార్‌

పీవీ శతజయంతి ఉత్సవాల గురించి..

ఆర్థిక, సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టి దేశగతిని ఒక మలుపు తిప్పిన మేధావి పీవీ. ఆనాడు ఆయన తీసుకున్న చర్యల ఫలితంగానే నేడు మనం ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడగలుగుతున్నం. చాలామంది అంటుంటారు దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపు రాలేదని. కానీ ఆయన ఓ చరిత్ర. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయడమేగాదు.. ఓ నూతన భారతాన్నే సృష్టించారు. ఇప్పటికీ ఆయనను మనం స్మరిస్తున్నామంటేనే ఆయన ప్రత్యేకత స్పష్టమవుతుంది. ఆయన స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు తెలియజేయాల్సి ఉంది. ఇంతకాలం ఆ కర్తవ్యాన్ని కాంగ్రెస్‌ సహా, అన్ని పార్టీలు విస్మరించాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకోవడం అభినందనీయం. పీవీ సేవలను నలుదిశలా చాటేలా భవిష్యత్‌ తరాలకు తెలిసేలా శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.


logo