శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:46:58

అనుమానాలు పటాపంచలు

అనుమానాలు పటాపంచలు

  • ఆస్తుల నమోదుపై అవగాహన
  • ‘నమస్తే తెలంగాణ’ కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘ఏదో ఇండ్ల సర్వే జరుగుతుందంట. మా ఇంటికి ఇంకా ఎవరూ రాలేదు. వస్తారో రారో.’‘మాకు ఇంటి స్థలం మాత్రమే ఉంది. దానిని కూడా సర్వే చేస్తారా? లేక కేవలం ఇండ్లనే చేస్తారా?’

‘ఇండ్ల సర్వే కోసమైతే మా వద్ద ఎలాంటి డాక్యుమెంట్లూ లేవు. ఇది మా తాతల నుంచి మాకు సంక్రమించిన ఇల్లు. ఇప్పుడు వీటికి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి?’.. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఆస్తుల నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేపై గ్రామాలు, పట్టణాల్లో ఇలాంటి అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వే గురించి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతుండటం, ఒకరు ఒక విధంగా, మరొకరు మరో విధంగా సమాధానం చెబుతుండటం వంటివి గ్రామీణులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ సందేహాలు, అనుమానాలు, అయోమయాలను నివృత్తి చేస్తూ ‘వివరాలు చాలు.. పత్రాలేం వద్దు’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ తన ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విశేష స్పందన లభించింది.

ఈ క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో సైతం చక్కర్లు కొట్టింది. సర్వే చేస్తున్న సిబ్బందికి చుక్కానిలా మారింది. ప్రతి ఇంటి వద్దా సర్వే ఉద్దేశాన్ని వివరించే ప్రయాస తప్పింది. సమగ్ర సమాచారం ఆ కథనంలో ఉండటంతో ప్రజలు కూడా అన్ని విషయాలు తెలుసుకున్నారు. అధికారులు ఆ పేపర్‌ కటింగ్‌ను తీసుకుని ఇంటింటికీ తిరుగుతూ సర్వే ఉద్దేశాన్ని వివరిస్తూ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. ప్రజాప్రతినిధులు కూడా పత్రికలోని ఆ కథనాన్ని చూపుతూ గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు సైతం ఈ కథనంపై చర్చించుకోవడం గమనార్హం. కొన్ని గ్రామాల్లో అధికారులు కూడా ఈ కథనాన్ని చూపిస్తూ వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం విశేషం. తొలుత సర్వేపై ప్రజల్లో కొన్ని అపోహలు ఏర్పడ్డాయని, ఈ కథనం చూపించడంతో వారు తమ సర్వే ఎంతో సహకరించారని సర్వే సిబ్బంది సైతం చెబుతున్నారు. 

 అపోహలు తొలగిపోయాయి..

ఆస్తులను ఆన్‌లైన్‌ చేస్తున్నారంటే మొదట బయపడ్డాం. పేదల ఆస్తులకు రక్షణ కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే చేస్తున్నదని ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ పూర్తి వివరాలతో కథనాన్ని ప్రచురించింది. దీంతో సర్వేపై ఉన్న అపోహలు తొలగిపోయాయి. ఈ కథనాన్ని చదవడంతో మాలో ఉన్న అనుమాలన్నీ నివృత్తి అయ్యాయి. వచ్చిన అధికారులకు ఏయే వివరాలు తెలియజేయాలనే విషయం అర్థమైంది. - చల్లా రాంబాబు, ఖమ్మం 2వ డివిజన్‌