బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 01, 2020 , 01:53:08

మేడారం జాతరకు భారీ బందోబస్తు

మేడారం జాతరకు భారీ బందోబస్తు
  • ఇద్దరు ఐజీలు, ఇద్దరు సీపీలు సహా 10వేల మందితో భద్రత
  • వీఐపీల కోసం మూడు హెలిప్యాడ్లు సిద్ధం
  • ‘నమస్తే తెలంగాణ’తో నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: మేడారం మహాజాతరకు పోలీస్‌శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనానికి రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రానున్న లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలుగకుండా భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణపై పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్టు నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ‘నమస్తేతెలంగాణ’తో జాతర బందోబస్తుపై మాట్లాడారు. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు కలిపి మొత్తం 10 వేల మంది పోలీస్‌ సిబ్బందిని వినియోగించనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి పూర్తిస్థాయిలో భద్రతా సిబ్బంది అం దుబాటులో ఉంటారన్నారు. 


బందోబస్తును ఇద్దరు ఐజీలు, ఇద్దరు సీపీలు, ఆరుగురు ఎస్పీలు, 25 మంది అడిషనల్‌ ఎస్పీలు, 96 మంది డీఎస్పీలు, 228 మంది సీఐలు, 731 మంది ఎస్సైలు, 70 మంది మహిళా ఎస్సైలు పర్యవేక్షించనున్నట్టు పేర్కొన్నారు. భద్రత విధుల్లో గతంలో మేడారం జాతర సమయంలో పనిచేసిన అనుభవజ్ఞులైన అధికారుల సేవలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా జాతరకు వచ్చే వీఐపీల కోసం మూడు హెలిప్యాడ్లు, ప్రైవేటు వ్యక్తుల కోసం మరో రెండు హెలిప్యాడ్లు కలిపి మొత్తం ఐదింటిని సిద్ధం చేశామన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిరంతర నిఘా పెడుతున్నామని, ఇందుకోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 


మేడారం నుంచి ములుగు వరకు మొత్తం 330 సీసీ కెమెరాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కదలికలను గమనించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 20 పీటీజెడ్‌ (ప్యాన్‌-టిల్ట్‌-జూమ్‌) కెమెరాలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ కెమెరాలోని నమోదయ్యే దృశ్యంలో ఒకేసారి 150 మంది కదలికలు అత్యంత స్పష్టంగా చూసే వీలుంటుందని చెప్పారు. కెమెరాలన్నింటీని మేడారం గద్దెల ప్రాంగణంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానించి ప్రతిక్షణం గమనిస్తున్నట్టు తెలిపారు. అటవీ ప్రాంతం కావడం, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశామని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రత్యేక బలగాలను మోహరించినట్టు నాగిరెడ్డి తెలిపారు. 


logo