సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:04

వైరస్‌ కట్టడిలో తెలంగాణ మెరుగు

వైరస్‌ కట్టడిలో తెలంగాణ మెరుగు

  • హృద్రోగులకే ముప్పు ఎక్కువ
  • ప్రజలు మరింత బాధ్యతగా ఉండాలి
  • విటమిన్‌ ట్యాబ్లెట్లతో ప్రయోజనం లేదు
  • ‘నమస్తే తెలంగాణతో’ ఇల్లినాయిస్‌ వర్సిటీ ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి మెరుగ్గా ఉన్నదని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి చెప్పారు. కరోనా వల్ల మరణిస్తున్న వారిలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. అమెరికాలో అంటువ్యాధుల వైద్య నిపుణులుగా, అమెరికన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ డిప్లొమాట్‌గా, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత్‌లోనే ఉండిపోయారు. ఆయన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఇదొక కల్లోల సమయం. ప్రభుత్వాలు, ప్రజలు వేరుకాదనే విషయాన్ని గుర్తించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. అప్పుడే కరోనాపై పోరాటంలో విజయం సాధించడం సాధ్యమవుతుంద’న్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చినవారు నిశ్చింతగా ఉండాలని సూచించారు. పౌష్టికాహారం తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లో ఉండి ఆరోగ్యవంతులుగా కావచ్చని చెప్పారు. పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు పల్స్‌ఆక్సీమీటర్‌ను దగ్గర ఉంచుకొని ఆక్సిజన్‌ శాతాన్ని గమనిస్తూ ఉండాలన్నారు. వైరస్‌ అత్యున్నతస్థాయికి చేరే దశలో ఉన్నదని, ప్రజలు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంతగా తమను తాము కాపాడుకోవచ్చని సూచించారు. కరోనా చికిత్సలో డెక్సామెథాసోన్‌ డ్రగ్‌ అద్భుతంగా పని చేస్తున్నట్లు బ్రిటన్‌లో అధ్యయనంలో తేలిందన్నారు. 

ఎక్కువ శాతం గుండె మరణాలు

కరోనా సోకినవారిలో 30 నుంచి 70 శాతం వరకు గుండె సమస్యలతో మరణిస్తున్నారని డాక్టర్‌ విజయ్‌ చెప్పారు. ‘వైరస్‌ గుండెకు వెళ్లే హృదయనాళాలను నాశనం చేస్తున్నది. గుండె సమస్యలున్న వారికి వైరస్‌ సోకితే రిస్క్‌ ఎక్కువ. వీరికి చికిత్సలో భాగంగా ఎజిత్రోమైసిన్‌, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ఇస్తే మరింత ప్రమాదం. ఇదే అంశంపై నేను ఐసీఎంఆర్‌కి లేఖ కూడా రాశాను’ అని తెలిపారు. 

విటమిన్‌ బిళ్లలు అనవసరం

ఆరోగ్యంగా ఉన్నవారు విటమిన్‌ ట్యాబ్లెట్లు తీసుకోవటం వల్ల కరోనా బారినపడకుండా ఉండగలరనే పరిశోధన ప్రపంచంలో ఎక్కడా జరగలేదని డాక్టర్‌ విజయ్‌ చెప్పారు. జింక్‌ ఓవర్‌డోస్‌ అయితే కాపర్‌ తగ్గిపోయి రక్తహీనతకు దారితీస్తుందన్నారు. ఏ మందైనా విషమేనని, ఆరోగ్యవంతులు వాటిని వాడటం వల్ల లాభం లేదని చెప్పారు. ఎవరికి విటమిన్‌ ట్యాబ్లెట్లు అవసరమో వైద్యులు చెప్తారని, వారి సూచనలు పాటించాలని పేర్కొన్నారు. 


logo