గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:29:24

కొద్ది మందికే ‘రెండో’ ప్రమాదం

కొద్ది మందికే ‘రెండో’ ప్రమాదం

  • కోలుకున్నవారు రోగ నిరోధక శక్తి తగ్గకుండా జాగ్రత్తపడాలి 
  • ‘నమస్తే తెలంగాణ’తో సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సోకి దానినుంచి కోలుకున్న వారికి మళ్లీ రెండోసారి వైరస్‌ సోకడంపై (రీ ఇన్ఫెక్షన్‌) పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్కకేసు మాత్రమే వెలుగుచూసిందని గుర్తుచేశారు. ఒకవేళ రీ ఇన్ఫెక్షన్‌ వచ్చినా అతితక్కువ మందికి మాత్రమే వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘కొవిడ్‌-19 రెండోసారి సోకడం ఆసక్తికరంగా అనిపిస్తున్నది. అయితే అందరికీ ఇలాగే జరుగుతుందని భయపడటం తొందరపాటు అవుతుంది. కరోనా రెండోసారి సోకడంపై లోతైన పరిశోధనలు జరగాలి. అప్పుడే స్పష్టత వస్తుంది. ఇందుకు కనీసం రెండేండ్ల సమయం పట్టొచ్చు’ అని పేర్కొన్నారు. గతంలోనూ వైరస్‌లు రెండోసారి సోకిన సందర్భాలు ఉన్నాయన్నారు. అయితే అతి తక్కువ మందిలోనే రీ ఇన్ఫెక్షన్‌ కనిపించిందని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారు రోగ నిరోధకశక్తి తగ్గకుండా జాగ్రత్తపడాలన్నారు. వైరస్‌ను ఎదురించే ప్రతిరక్షకాలు ఉ న్నా.. కొందరిలో రోగనిరోధక శక్తి తగ్గితే రీ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు.

బలహీన పడుతున్నట్టు సంకేతాలు 

కొవిడ్‌-19 వైరస్‌ ప్రారంభంలో ఉన్నంత ప్రమాదకరంగా లేదని రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు. ‘ఐదారునెలల కిందట వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించేవి. అందరికీ శ్వాస సంబంధ సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు 80 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్న చాలామందికి వైరస్‌ సోకిన విషయం.. దాని నుంచి కోలుకున్న విషయం కూడా తెలియడం లేదు. వైరస్‌ బలహీనపడుతున్నదని చెప్పడానికి ఇదొక సంకేతం’ అని పేర్కొన్నారు. అదేసమయంలో వైరస్‌ వ్యాప్తిపై అవగాహన పెరుగడం, చికిత్సావిధానాలు మెరుగుపడటం కూడా కలిసివచ్చిందన్నారు. 

కోలుకున్నా.. మళ్లీ వైరస్‌..

న్యూఢిల్లీ, ఆగస్టు 25: హాంకాంగ్‌లో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వైరస్‌ సోకింది. ఆ దేశానికి చెందిన 33 ఏండ్ల వ్యక్తి ఏప్రిల్‌లో కరోనా నుంచి కోలుకున్నారు. అనంతరం యూరప్‌లో పర్యటించిన ఆయన ఇటీవల తిరిగి హాంకాంగ్‌కు వచ్చారు. విమానాశ్రయంలో వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు వెల్లడైంది. ఇటీవల పలు దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి రెండోసారి వైరస్‌ సోకినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో స్పష్టతలేదు. హాంకాంగ్‌లో రెండోసారి వైరస్‌ సోకడంపై పూర్తి వివరాలు నమోదుచేసిన తొలి కేసు ఇదేనని పరిశోధకులు భావిస్తున్నారు. 

తాజావార్తలు


logo