మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 17:05:40

దిగుబడిలో ఉమ్మడి నల్లగొండదే మొదటి స్థానం

దిగుబడిలో ఉమ్మడి నల్లగొండదే మొదటి స్థానం

నల్లగొండ : వరి దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ మొదటి స్థానంలో నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతే కారణమని ఆయన కొనియాడారు. జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన నకిరేకల్ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలక వర్గాన్నీ మంత్రి అభినందించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. యసంగిలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వరి దిగుబడిలో రికార్డ్ సృష్టించిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయం పండుగగా మారాడమే నిదర్శనమన్నారు. 2014కు ముందు విత్తనాల కోసం క్యూలో జరిగిన లాఠీ చార్జీలు,విద్యుత్ కోసం సబ్ స్టేషన్ లపై దాడులు రైతుల అరెస్టులు ఉండేవన్నారు. దానికి తోడు శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యి అవ్వడంతోటే విపక్షాలు లాంతర్లు,ఎండిపోయిన వరి కంకులను ప్రదర్శించిన సందర్భాలను మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.


నేడు పచ్చని పంట పొలాలతో తులతూగుతున్నాయని తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ చలువే నని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, గుజ్జ దీపిక, తుంగతుర్తి, హుజూర్‌నగర్‌ శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.