సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 08:40:26

ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు

హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాగా నాయిని మృతిపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మినిస్టర్‌ క్వార్టర్స్‌కు పార్థీవ దేహం

తెలంగాణ రాష్ట్ర తొలి హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి పార్థివ శరీరాన్ని అపోలో ఆస్పత్రి నుంచి మినిస్టర్ క్వార్టర్స్‌కు తరలించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఆస్పత్రికి వెళ్లి నాయిని భౌతికకాయాన్ని మినిస్టర్ క్వార్టర్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో నర్సన్న కీలకపాత్ర పోషించారన్నారు. కార్మిక నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాయిని నర్సింహా రెడ్డి మరణం కార్మిక లోకానికి కి తీరనిలోటని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. అనంతరం క్వార్టర్స్‌లో చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.