శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 13:46:38

జార్జ్ ఫెర్నాండెజ్‌కు ప్రియమైన శిష్యుడు నాయిని

జార్జ్ ఫెర్నాండెజ్‌కు ప్రియమైన శిష్యుడు నాయిని

హైదరాబాద్‌ : సోషలిస్టు జాతీయ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్‌కు నాయిని నర్సింహారెడ్డి ప్రియమైన శిష్యుడు. రాంమనోహర్ లోహియా మార్గంలో నడిచిన గొప్ప నాయకుడు నాయిని. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌కు అండగా నిలిచారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం మంత్రుల నివాస ప్రాంతంలో నాయిని నర్సింహారెడ్డి భౌతిక కాయానికి పూల మాలలు వేసి వినోద్ కుమార్ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సోషలిస్టు ఉద్యమానికి తెలంగాణ ప్రాంతం నుంచి వెన్నెముకగా నిలిచిన నాయిని సేవలు మారువలేమని పేర్కొన్నారు.తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తొలి, మలి విడత ఉద్యమకారుడు నాయిని అని, ఉద్యమ నాయకులు కేసీఆర్ కు నాయిని సంపూర్ణ సహకారాన్ని అందించారని వినోద్ కుమార్ కొనియాడారు.

కార్మికుల ఉద్యమాల్లో నాయిని ఉద్దండులు అని, కార్మికుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని ఆయన తెలిపారు. నర్సింహారెడ్డి భోళా శంకరుడు అని, అతనిది పసివాని హృదయమన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా నాయినితో అనుబంధం ఉందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. నాయినికి నివాళులు అర్పించిన వారిలో డాక్టర్ బోయినపల్లి ప్రతీక్, బోయినపల్లి ప్రణయ్ ఉన్నారు.