మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 01:40:22

ఉపాధికి వారధి న్యాక్‌

ఉపాధికి వారధి న్యాక్‌

  • కార్మికులు.. సంస్థలకు మధ్య సమన్వయం
  • నెలలో పదివేలమందికిపైగా పేర్లు నమోదు
  • వివరాల సీడీ ఆవిష్కరణలో మంత్రి వేముల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పనికోసం ఎదురుచూసే కార్మికులు.. పనివారి కోసం అన్వేషించే నిర్మాణరంగ సంస్థల మధ్య నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌(న్యాక్‌) వారధిలా పనిచేస్తున్నదని గృహనిర్మాణశాఖ మంత్రి, న్యాక్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గతనెల 6న ప్రారంభించిన న్యాక్‌ వెబ్‌సైట్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, నెలలోనే 10,090 మంది కార్మికులు వెబ్‌సైట్‌( http://tsnac.cgg.gov.in)లో పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాలశాఖ కార్యాలయంలో శనివారం కార్మికుల వివరాలకు సంబంధించిన సీడీని మంత్రి ఆవిష్కరించారు. 

బీఏఐ, క్రెడాయ్‌, టెడ్రా, టీబీఎఫ్‌, ఐజీబీసీ వంటి నిర్మాణరంగ సంస్థల ప్రతినిధులకు సీడీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా సంస్థల అవసరాల మేరకు, నమోదు చేసుకున్న కార్మికులకు ఉపాధి అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వెబ్‌సైట్‌కు భారీ స్పందన రావడంపై సంతోషంగా ఉన్నదని, న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ భిక్షపతి బృందాన్ని అభినందిస్తున్నామని చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో న్యాక్‌ ముఖ్యభూమిక పోషించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. 


logo