మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 01:46:04

సాగర్‌ ఎడమకాల్వకు పునర్జీవం

సాగర్‌ ఎడమకాల్వకు పునర్జీవం
  • 1700 కోట్లతో 96 టీఎంసీల కృష్ణా, గోదావరిజలాల వినియోగానికి ప్రణాళిక
  • సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ ఆధారంగా అలైన్‌మెంట్‌
  • ప్రభుత్వానికి విశ్రాంత ఇంజినీర్ల సంఘం నివేదిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పునర్జీవానికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం (ట్రీ) రూ.1700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. దాదాపు 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి భరోసా కల్పించేలా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి ట్రీ సమర్పించింది. సీతారామ ఎత్తిపోతల పథకంలోని ప్రధానకాల్వను ఆధారం చేసుకొని ఈ పునర్జీవ పథకానికి రూపకల్పనచేసిన దరిమిలా తక్కువ ఖర్చుతోనే బహుళ ప్రయోజనాలు పొందవచ్చని నివేదికలో ట్రీ పేర్కొన్నది. ఈ పథకంతో మున్నేరు జలాల్ని కూడా వినియోగంలోకి తీసుకురావచ్చని చెప్తున్నారు. కృష్ణానదిపై ఎగువన కర్ణాటక పలు ప్రాజెక్టులు నిర్మించడం, శ్రీశైలంపై పలు సాగునీటి ప్రాజెక్టులు రావడంతో కృష్ణాజలాల వినియోగం భారీస్థాయికి చేరింది. దీంతో నాగార్జునసాగర్‌ ఆయకట్టు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. 


ఈ నేపథ్యంలో సాగర్‌ ఎడమకాల్వ కిందున్న ఆయకట్టుకు గోదావరిజలాలతో శాశ్వత భరోసా కల్పించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ఇందుకు సీతారామ ప్రాజెక్టుద్వారా గోదావరిజలాల తరలింపును చేపట్టారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను తరలించి పాలేరు దిగువన ఉన్న సాగర్‌ ఎడమకాల్వ కింద ఆయకట్టును స్థిరీకరించనున్నారు. మూడుదశల్లో గోదావరిజలాలను ఎత్తిపోసేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుపనులు వేగంగా సాగుతున్నాయి. సీతారామ ప్రాజెక్టులో ని పంప్‌హౌజ్‌లు, ప్రధానకాల్వను వినియోగించుకొని సాగర్‌ ఎడమకాల్వకు పునర్జీవం కల్పించేందుకు విశ్రాంత ఇంజినీర్లు ఒక నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించారు.


96 టీఎంసీల జలాల వినియోగం

సీతారామ ప్రధానకాల్వ నుంచి పాలేరు జలాశయానికి గోదావరిజలాలను తరలించేందుకు టన్నెల్‌సహా 208 కిలోమీటర్లకుపైగా కాల్వనిర్మా ణం చేపట్టాల్సి ఉన్నది. అయితే ట్రీ నివేదిక ప్రకారం, 21ఎల్‌ కాల్వను 4.70 కిలోమీటర్‌ వద్దనే ముగించి 5500 క్యూసెక్కుల గోదావరిజలాల్ని నేరుగా నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ (21వ ఎంబీసీ)లో 41.390 కిలోమీటర్‌ వద్ద నిర్మించే క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద పోస్తారు. అనంతరం 21వ ఎంబీసీ కాల్వలోనే మూడుదశల్లో నీటిని వెనుకకు ఎత్తిపోయడం ద్వారా జలాలు పాలేరు రిజర్వాయర్‌లోకి చేరుతాయి. తిరిగి పాలేరు రిజర్వాయర్‌ నుంచి సాగర్‌ ఎడమకాల్వలోనే మరో మూడుదశల్లో ఎత్తిపోతలద్వారా నల్లగొండ జిల్లాలోని దేవులపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి నీటిని తరలిస్తారు. అదేవిధంగా మున్నేరు మీద ఒక బరాజ్‌ను నిర్మించి మరో లిఫ్టుద్వారా ఆ జలాల్ని కూడా 21వ ఎంబీసీలో పోయడంవల్ల 72 టీఎంసీల గోదావరి జలాలతోపాటు 24టీఎంసీల మున్నేరు నీటిని కూడా వినియోగించుకోవచ్చని ట్రీ ప్రతినిధులు ఆ నివేదికలో పేర్కొన్నారు. 


వాస్తవ అంచనా రూ.2700 కోట్లు

సీతారామ ఎత్తిపోతల పథకం అలైన్‌మెంట్‌ ప్రకా రం ప్రధానకాల్వ నుంచి పాలేరు జలాశయానికి గోదావరి జలాలు తరలించేందుకు టన్నెల్‌తో సహా 104 కిలోమీటర్లకుపైగా కాల్వలను, ఇతర నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు రూ. 2700 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. కానీ తాజా ప్రతిపాదనవల్ల వాటి నిర్మాణాల అవసరం ఉండదు. సీతారామ కింద చేపట్టాల్సిన నిర్మాణాలను మినహాయించడం వల్ల రూ.వెయ్యి కోట్లు ఆదా అవుతాయి. దీంతో సాగర్‌ పునర్జీవన పథకానికి రూ.1700 కోట్ల వరకు ఖర్చుకాగలదని ట్రీ తన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ట్రీ ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి చెప్పారు.


logo
>>>>>>