ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:01

సాగర్‌ క్రస్ట్‌గేట్లను తాకిన కృష్ణమ్మ

సాగర్‌ క్రస్ట్‌గేట్లను తాకిన కృష్ణమ్మ

  • 547.60 అడుగులకు చేరిన నీటిమట్టం
  • ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఈ ఏడాది కృష్ణానది ముందస్తుగానే జలకళను సంతరించుకున్నది. ఎగువన ఆల్మట్టి, నారాయణపుర నిండటంతో జూరాల మీదుగా కృష్ణమ్మ శ్రీశైలం రిజర్వాయర్‌ను ముద్దాడింది. అక్కడి నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు చేరుకుంటున్నది. గడిచిన 14 రోజుల్లో 17 అడుగుల మేర నీటిమట్టం పెరిగి ప్రస్తుతం సాగర్‌లోని క్రస్ట్‌గేట్ల వరకు వరద చేరింది. గతేడాదితో పోలిస్తే శ్రీశైలానికి రెండు వారాల ముందుగానే కృష్ణానదికి వరద ప్రవాహం మొదలుకావడంతో నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతున్నది. లక్ష్మి బరాజ్‌కు భారీగా ఇన్‌ఫ్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి బరాజ్‌లోకి వరద వచ్చి చేరుతున్నది. శుక్రవారం 63,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 58,200 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 35 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. బరాజ్‌లో ప్రస్తుతం 10.371 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. సరస్వతీ బరాజ్‌కు వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఒక గేటు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 10.86 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.23 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు తెలిపారు.logo