శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Aug 20, 2020 , 01:49:32

విచారిస్తేనే అసలు కథ తెలిసేది!

విచారిస్తేనే అసలు కథ తెలిసేది!

  •  నాగరాజు కస్టడీకి ఏసీబీ పిటిషన్‌ 
  •  శ్రీనాథ్‌ పాత్రపైనా లోతైన ఆరా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లంచంగా కోటి 10 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్‌ అక్రమాల పుట్ట బద్దలు కొట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా పలు అంశాలను నిర్ధారించుకున్న ఏసీబీ అధికారులు.. మరింత సమాచారం కోసం చూస్తున్నారు. ఇప్పటికే తాసిల్దార్‌ నాగరాజు, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్‌ను నాలుగు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినందున..వారిని విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. నిందితుల కస్టడీపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ మొత్తం సెటిల్‌మెంట్‌లో అంజిరెడ్డితోపాటు కీలకంగా వ్యవహరించిన శ్రీనాథ్‌యాద్‌పాత్రపైనా ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. భారీ లంచం వెనుక చక్రం తిప్పింది శ్రీనాథ్‌ అని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. శ్రీనాథ్‌, కీలకనేత అనుచరుడు అంజిరెడ్డిలు కలిసి ఎన్నేళ్లుగా ఈ తరహా సెటిల్‌మెంట్లకు పాల్పడ్డారు? వారికి వెనుక నుంచి సహకారం అందిస్తున్న నేతలు ఎవరన్నది కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.   

రాంపల్లి భూముల్లో పెద్దల హస్తం: వీహెచ్‌

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: కీసర మండలం రాంపల్లి దాయారా గ్రామంలోని వివాదస్పద భూములపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీ హనుమంతరావు మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లును కోరారు. తాసిల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో వివాదాస్పద భూములను బుధవారం స్వయంగా పరిశీలించిన వీహెచ్‌ అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాంపల్లి దాయారాలో జరిగిన  భూ కుంభకోణంలో పెద్దల హస్తం ఉన్నదని, అది ఎవరు అనేది తేల్చాలని అన్నారు. కీసరకు చెందిన 150 దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.