శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 17:05:05

మంత్రి కేటీఆర్‌ సూచనలకు నాబార్డ్‌ సానుకూలం

మంత్రి కేటీఆర్‌ సూచనలకు నాబార్డ్‌ సానుకూలం

హైదరాబాద్‌ : నాబార్డ్‌(వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు) సీజీఎం వై.కే.రావుతో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డుకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ప్రస్తుతం వస్తున్న వ్యవసాయోత్పత్తుల విప్లవం వలన రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని మంత్రి అన్నారు. కావునా ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు నాబార్డ్‌ ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కోరారు. 

ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటర్నెట్‌ అందించే లక్ష్యంతో తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వీలు కలుగుతుందన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయరంగంలో అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌కు రుణసాయం అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నాబార్డు పాడి పశువుల అభివృద్ధి కార్యక్రమాన్ని మరింతగా విస్తరించాలన్నారు. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు నిర్మిస్తున్న గోడౌన్‌లకు మంత్రి నాబార్డ్‌ సాయాన్ని కోరారు. మంత్రి సూచనలు, విజ్ఞప్తులపై నాబార్డ్‌ సానుకూలంగా స్పందించింది.


logo