బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 30, 2020 , 02:05:11

మటన్‌ కిలో 800.. చికెన్‌ 180

మటన్‌ కిలో 800.. చికెన్‌ 180

-రాష్ట్రంలో పెరుగుతున్న మాంసం ధరలు

-దుకాణాల ఎదుట వినియోగదారుల బారులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాంసం ధరలు భారీగా పెరిగాయి. మటన్‌ గతంలో ఎన్నడూ లేనంతగా కిలో రూ.800 కు చేరుకొన్నది. బోన్‌లెస్‌ మటన్‌ కిలో రూ.950 నుంచి రూ.1000 పలుకుతున్నది. నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న చికెన్‌ ధర కూడా ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.180, డ్రెసెడ్‌ రూ.155, లైవ్‌ రూ.105గా ఉన్నది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చికిన్‌ కిలో రూ.200 వరకు విక్రయించారు. ఆదివారం కావడంతో మాంసం దుకాణాల ఎదుట జనం బారులు తీరి కనిపించారు. చికెన్‌, గుడ్లు తింటే కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో చికెన్‌ ధరలు అమాంతం పడిపోయాయి. కిలో చికెన్‌ రూ.20-40కి చేరింది. కొన్ని ప్రాంతాల్లోనైతే కోళ్లను ఉచితంగా పంచిపెట్టారు. మరికొన్ని చోట్ల ఉచితంగా ఇచ్చినా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని పాతిపెట్టారు. కరోనా దెబ్బతో రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమ సుమారు రూ.1500 కోట్ల మేర నష్టపోయింది. చికెన్‌, గుడ్లు పోషకాహారం అని, వీటిని తినడం వల్ల రోగనిరోధకత పెరుగుతుందని పరిశ్రమవర్గాలు చేసిన ప్రచారం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో చికెన్‌కు మళ్లీ పాతరోజులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మటన్‌కు డిమాండ్‌ మరింత పెరిగిది. కిలో రూ.800కు అమ్ముతున్నా మాంసం ప్రియులు వెనుకాడటం లేదు. అలాగే చేపలు, రొయ్యల ధరలు కూడా పెరిగినట్టు తెలిసింది. సరఫరా తగ్గడంతో చికెన్‌, గుడ్ల ధరలు పెరుగుతున్నాయదని వ్యాపారులు చెప్తున్నారు.


logo