ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 02:55:05

పేదల ఆస్తులకు.. మ్యుటేషన్‌ కవచం

పేదల ఆస్తులకు.. మ్యుటేషన్‌ కవచం

  • ఆన్‌లైన్లో చేర్చడం కోసమే మ్యుటేషన్‌
  • ఇది నిరుపేదలకు పూర్తిగా ఉచితం 
  • ప్రతి ఇంచు భూమి ధరణిలో సురక్షితం 
  • వ్యవసాయేతర ఆస్తులకు పూర్తి భద్రత

న్యాయబద్ధమైన హక్కులు..

వాస్తవానికి ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే.. ఒక ఆస్తి ఫలానా వ్యక్తికి సంబంధించినదే అని చెప్పేందుకు ఒకే ఒక్క దిక్కు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌. అంతకు మించి వేరే ఆధారం కానీ.. దారికానీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న మ్యుటేషన్‌, ధరణి పోర్టల్‌లో పొందుపర్చడం ద్వారా.. సంబంధిత వ్యక్తికి ఆస్తులపై పూర్తిగా చట్టబద్ధమైన హక్కులు సంక్రమిస్తాయి. సదరు ఆస్తులు ఎవరికి సంబంధించినవనేది పూర్తిగా డాక్యుమెంటేషన్‌ జరుగుతుందన్నమాట. దీనితో ఎలాంటి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం ఏర్పడదు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దశాబ్దాలుగా సామాన్యులు ఎదుర్కొంటున్న ఆస్తి సమస్యలకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా చెక్‌ పెడుతున్నది.  వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు, ఘర్షణలు తలెత్తకుండా ఉండేలా చట్టం పరిధిలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వేగవంతం చేస్తున్నది. ఇప్పటికే వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్‌లో ఎక్కించేందుకు పక్రియను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయాలను వేగంగా తీసుకుంటున్నది. అందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా.. పేదలకున్న వ్యవసాయేతర ఆస్తులను పూర్తి ఉచితంగా మ్యుటేషన్‌ చేయడంతోపాటు, ధరణి పోర్టల్‌లో నమోదుచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 

సంపూర్ణ రక్షణ

వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలను ఆకుపచ్చ పాస్‌బుక్‌లో నమోదుచేస్తున్నట్టుగానే, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌లో నమోదుచేసి ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి కసరత్తు వేగంగా పుంజుకొన్నది. వాస్తవానికి ఇప్పుడు చేపట్టిన మ్యుటేషన్‌ కేవలం ఆన్‌లైన్‌లో పెట్టడం కోసం మాత్రమే. దీనివల్ల ఆయా ఆస్తులకు పూర్తి భద్రత కలుగుతుంది. ఇవి పూర్తిగా వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి మాత్రమే. నిరుపేదలకు ఉన్న ఇండ్లు, గుడిసెలతోపాటు.. వారి నివాసాలను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలు, పెరడు లాంటివన్నీ.. ఈ మ్యుటేషన్‌ ద్వారా మెరూన్‌ పాస్‌పుస్తకాల్లోకి ఎక్కించి.. ఆపై ధరణి పోర్టల్‌లో పెడతారు. దీనితో ప్రజలకు సంబంధించిన ప్రతి ఇంచు ఆస్తి, భూమి కూడా ప్రభుత్వ రికార్డుల్లో భద్రంగా, క్షేమంగా ఉంటుంది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు.

వారసత్వంకూడా సులువే..

ఇంటి ఆస్తులు, ఖాళీ జాగాలను పంచుకునేటపుపడు వారసత్వం వివాదాలు, ఘర్షణలు షరా మాములే మనకు. ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేలా ఈ మ్యుటేషన్‌ ప్రక్రియలో వారసుల వివరాలను కూడా నమోదుచేస్తారు. ఒక వ్యక్తికి ఉన్న వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పూర్తిగా పొందుపర్చడంతోపాటు.. ఆయనకున్న వారసుల వివరాలనుకూడా వారి పేర్లు, ఆధార్‌ నంబర్లతో సహా మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌లో ఉచితంగా పొందుపరుస్తారు. దీనివల్ల చట్టబద్ధమైన హక్కులపై ఎలాంటి వివాదాలుండవు. వారసులందరూ ఒక ఒప్పందం కుదుర్చుకుని ఆ వివరాలను రిజిస్ట్రేషన్‌ అధికారులకు సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు.. పూర్తి కొలతలతో వారసుల పేరుపైకి ఆస్తులు బదలాయింపు జరుగుతుంది. అంటే భవిష్యత్తులో వారసత్వానికి సంబంధించిన వివాదాలు, ఘర్షణలు చాలావరకు తగ్గుతాయి.

ఆస్తుల సమాచారమే.. విలువ కాదు..

ఇలా వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ ఒకే పాస్‌బుక్‌లో ఉండటం.. ఆపై ఆ సమాచారమంతా ధరణి పోర్టల్‌లో పొందుపర్చడం ఒక వ్యక్తికి ఉన్న వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ ఒక దగ్గరే సమగ్రంగా, సంపూర్ణంగా అందుబాటులో ఉంటాయన్నమాట. వ్యవసాయేతర ఆస్తుల వివరాలు మాత్రమే ఉంటాయి కానీ.. ఈ వ్యవసాయేతర ఆస్తుల అసెస్‌మెంట్‌ మాత్రం ఉండదు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే.. ఒక ఆస్తి ఫలానా వ్యక్తికి సంబంధించినదే అని చెప్పేందుకు న్న ఒకే ఒక్క దిక్కు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌. అంతకు మించి వేరే ఆధారం కానీ.. దారికానీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న మ్యుటేషన్‌, ధరణి పోర్టల్‌లో పొందుపర్చడం ద్వారా.. సంబంధిత వ్యక్తికి ఆస్తులపై పూర్తిగా చట్టబద్ధమైన హక్కులు సంక్రమిస్తాయి. సదరు ఆస్తులు ఎవరికి సంబంధించినవనేది పూర్తిగా డాక్యుమెంటేషన్‌ జరుగుతుందన్నమాట. దీనితో ఎలాంటి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం ఏర్పడదు. 

పేదలకు వరం..

ఇలా తనకు ఉన్న ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారంతో మ్యుటేషన్‌ చేయించడం, ధరణి పోర్టల్‌లో పెట్టడం, ఆ వివరాలతో మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌ ఉండటం.. ఆపై అందులో వారసుల పేర్లు పొందుపర్చడం వల్ల సదరు ఆస్తుల విలువ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది పేదలకు ఒక గొప్ప వరం. దీనివల్ల సదరు ఆస్తిపై పూర్తి హక్కులు వారికి రావడంతోపాటు.. భవిష్యత్తులో ఎలాంటి భయం ఉండదు. పేదల ఆస్తులకు పూర్తి భద్రత, సంరక్షణ లభిస్తుంది. అలాగే ఆస్తుల విలువ పెరగడంతో.. అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలు లాంటివి చాలా సులువుగా దొరుకుతాయి. ఆన్‌లైన్‌లో ఉన్న ఆస్తుల వివరాలను సరిచూసుకుని బ్యాంకులు రుణాలు మంజూరుచేసే అవకాశం ఉంటుంది. ఇలా పేదలకు సంబంధించి వ్యవసాయేతర ఆస్తులపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు వస్తాయి. రికార్డులు, ఆస్తులు భద్రంగా ఉంటాయి.. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలూ తలెత్తవు. వారసుల పేర్లు ముందుగానే రికార్డు చేయడం ద్వారా వివాదాలను ముందే ఆడ్డుకున్నట్టు అవుతుంది. అందుకే అందరూ ఈ మ్యుటేషన్‌ చేయించుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది.logo