మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 27, 2020 , 02:03:53

ఇంట్లోనే నమాజ్‌

ఇంట్లోనే నమాజ్‌

-మక్కామసీద్‌ మతపెద్ద ఖదీర్‌ సిద్దిఖీ పిలుపు

-సామూహిక ప్రార్థనలొద్దు: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

-ప్రభుత్వానికి ముస్లింలు సహకరించాలి: ఎమ్మెల్సీ సలీం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముస్లింలు ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని మక్కామసీద్‌ పెద్ద మహమ్మద్‌ అబ్దుల్‌ఖదీర్‌ సిద్దిఖీ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ నుంచి బయటపడాలంటే మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని కోరారు. కరోనా నియంత్రణలోకి వచ్చా క తిరిగి ప్రారంభమవుతాయని గురువారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లిం లంతా శుక్రవారం సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని, ఇండ్లలోనే నమాజ్‌ చేయాలని ఎంఐఎంనేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.  

ఇంట్లోనూ దూరం: వక్ఫ్‌బోర్డు చైర్మన్‌

కరోనా నివారణకు ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం కోరారు. గురువారం వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండ్లలోనే నమాజ్‌ చేయాలని, సామూహిక ప్రార్థనలు చేయకూడదని మౌజన్‌, ఇమామ్‌లు.. మిగిలినవారికి అర్థమయ్యేలా చెప్పాలని విన్నవించారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడుతున్నారని, ముస్లింలు కూడా  సహకరించాలని కోరారు. రంజాన్‌ సమయంలో ఇచ్చే జకాత్‌ (దానం)ను ప్రస్తుతం కూడా అందజేయాలని సూచించారు. ముస్లింలు ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని  తెలంగాణ స్టేట్‌ వక్ఫ్‌బోర్డు ఆదేశాలు జారీచేసింది.

ప్రజల సహకారం ముఖ్యం: ఖమరుద్దీన్‌

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను పాటించాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఖమరుద్దీన్‌ కోరారు. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, భయపడాల్సిన అవసరంలేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 


logo
>>>>>>