గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 19:14:52

మోహన్ భగవత్‌కు అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్

మోహన్ భగవత్‌కు అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా నమోదు (ఎన్ఆర్సీ)పై ముస్లింలను ఇతరులు తప్పుదోవ పట్టించడానికి మేము చిన్న పిల్లలం కాదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్‌కు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. విజయ దశమి సందర్భంగా నాగపూర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మోహన్ భగత్ మాట్లాడుతూ.. ‘సీఏఏను సంబంధిత మతం వారు వ్యతిరేకించలేదు. ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకించే వారే మన ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారు. ముస్లిం జనాభా నియంత్రణ కోసమే అన్నట్లుగా అబద్ధపు ప్రచారం చేశారు ’ అని వ్యాఖ్యానించారు. సీఏఏ పేరుతో అవకాశవాదులు నిరసనలతో హింసకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

దీనికి అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. తప్పుదారి పట్టడానికి తాము పిల్లలం కాదన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ ముస్లింలకు వ్యతిరేకం కాకపోతే ఆ చట్టాల్లో మత ప్రస్తావనలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మా భారత జాతీయతను ప్రశ్నించే, మతపరమైన పౌరసత్వానికి సంబంధించిన చట్టాలకు వ్యతిరేకంగా తాము పోరాడుతూనే ఉంటామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. తమ నిరసనల సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీల మౌనాన్ని కూడా తాము మరిచిపోమని ఆయన అన్నారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.