డిప్రెషన్‌కు కచ్చితమైన కారణమంటూ కనిపించదు. జీవితంలో తీవ్రమైన నిరాశను ఎదుర్కోవడం నుంచి జన్యువుల వరకూ ఎన్నో కారణాలు ఉండవచ్చు. కాలం ఎలాంటి గాయాన్నయినా మాన్పుతుందన్నట్టు కొన్ని సందర్భాల్లో సమయంతో పాటే డిప్రెషన్ కూడా సమసిపోవచ్చు. మరికొన్నిసార్లు కౌన్సిలింగ్ ద్వారా సరిదిద్దవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో యాంటి డిప్రెసెంట్స్ లాంటి మందులు వాడాల్సి ఉంటుంది. మందులు వాడినా ఆ వ్యక్తి మానసిక స్థితిలో మార్పు రాకపోతే? ఇది నిజంగా ఆందోళన కలిగించే సమస్యే. ఎందుకంటే డిప్రెషన్‌తో సతమతమయ్యేవారు ఆత్మహత్యలాంటి అనూహ్యమైన చర్యలకు పాల్పడవచ్చు. ఇందుకు ఓ పరిష్కారం దొరికిందని అంటున్నారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. మనం లాఫింగ్గ్యాస్గా పిలుచుకునే నైట్రస్ ఆక్సైడ్‌ను కాస్త పట్టిస్తే, డిప్రెషన్ తీవ్రత తగ్గుతుందని వీరు తేల్చారు. అధ్యయనంలో భాగంగా.. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడేవారిని ప్రాణవాయువు, నైట్రస్ ఆక్సైడ్ కలిసిన గాలిని పీల్చమని అడిగారు. స్పష్టమైన కారణం తెలియక పోయినా… ఈ విధానంతో డిప్రెషన్ బాధితులకు ఉపశమనం కలుగుతున్నట్టు గుర్తించారు.