మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 02:13:34

37 ఏండ్ల తర్వాత మూసీ మహోగ్రం

37 ఏండ్ల తర్వాత మూసీ మహోగ్రం

  • ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో 2 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద

సూర్యాపేట, నమస్తే తెలంగాణ: నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు సాగునీరు, పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే మూసీ ప్రాజెక్టు మహోగ్రరూపం దాల్చింది. భారీగా వరదతో 37 ఏండ్లనాటి రికార్డులను తిరుగరాసింది. ఎగువనుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్కుల నీటిని అదేస్థాయిలో దిగువకు వదలడంతో ప్రవాహం సముద్రాన్ని తలపించింది. మూసీ ప్రాజెక్టులోకి అత్యధికంగా 1983లో 2.26 లక్షల క్యూసెక్కుల వరద రాగా, బుధవారం ఉదయం రికార్డుస్థాయిలో 2.27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. మూడ్రోజులుగా హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించడంతో అక్కడ నాలాలు పొంగి పారాయి. 

గండిపేట, హుస్సేన్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ పొంగిపొర్లడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా మూసీలోకి కలిసి వరద ప్రవాహం పోటెత్తింది. వరంగల్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు మూసీకి వచ్చే బిక్కేరు వాగు పొంగింది. ఇలా రెండు దిక్కుల నుంచి మూసీకి ఉధృతంగా నీరు చేరింది. 4.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న మూసీ ప్రాజెక్టుకు 2.27 లక్షల క్యుసెక్కుల చొప్పున వరదవస్తే కేవలం 3 గంటల వ్యవధిలోనే నిండుతుందని అధికారులు తెలిపారు. 

కాగా, మూసీ ప్రాజెక్టు, ఆయకట్టుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఢోకా ఉండబోదని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. మూసీ వరద ఉధృతి పెరిగినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం శాసనమండలి సమావేశాల నుంచి మంత్రి నేరుగా మూసీ ప్రాజెక్టుకు చేరుకొని తగిన చర్యలు తీసుకున్నారు. అటు.. కృష్ణా , గోదావరి ప్రాజెక్టుల్లో వరద పోటెత్తడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. 


logo