శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 29, 2020 , 02:21:32

నేరేడుచర్ల పురపీఠం టీఆర్‌ఎస్‌ వశం

నేరేడుచర్ల పురపీఠం టీఆర్‌ఎస్‌ వశం
  • చైర్మన్‌గా జయబాబు, వైస్‌చైర్‌పర్సన్‌గా శ్రీలతారెడ్డి
  • మేడ్చల్‌ మున్సిపాలిటీ కూడా కారు ఖాతాలోనే
  • చైర్‌పర్సన్‌గా దీపికానర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్‌గా రమేశ్‌
  • నల్లగొండ వైస్‌చైర్మన్‌ ఎన్నిక మళ్లీ వాయిదా

నేరేడుచర్ల/ నల్లగొండ/మేడ్చల్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలోని మున్సిపల్‌, నగరపాలక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. సోమవారం తొమ్మిదింటికి తొమ్మిది కార్పొరేషన్లనూ క్లీన్‌స్వీప్‌ చేసిన గులాబీ దళం.. 118 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ ఎన్నికలు జరుగగా, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం కోరంలేక వాయిదా పడిన నేరేడుచర్ల, మేడ్చల్‌ పుర పీఠాలను కూడా మంగళవారం టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకొన్నది. మరోవైపు బుధవారం జరిగే కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి కూడా అధికార పార్టీకి చిక్కనున్నది. 


కాగా, నల్లగొండ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదాపడింది. నూతనంగా ఏర్పడిన నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. ఇక్కడ మొత్తం 15 వార్డులకు టీఆర్‌ఎస్‌-7, కాంగ్రెస్‌-7, కాంగ్రెస్‌ బలపర్చిన సీపీఎం-1 స్థానంలో గెలుపొందగా.. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, శేరి సుభాష్‌రెడ్డి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ సభ్యుల సంఖ్య 11కు చేరింది. 


కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రారావు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. దీంతో వారిసంఖ్య 10కి చేరింది. శేరి సుభాష్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటుగా నమోదుచేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికలను బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. ఎన్నికల నిర్వహణకు 11మంది కోరం సరిపోవడంతో మున్సిపల్‌ ఎన్నికల ఇంచార్జి సుందరి కిరణ్‌కుమార్‌, జిల్లా ఎన్నికల పరిశీలకుడు చంపాలాల్‌ సమక్షంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికను నిర్వహించారు. చైర్మన్‌గా చందమళ్ల జయబాబును, వైస్‌చైర్‌పర్సన్‌గా చల్లా శ్రీలతారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. 


అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడిన భాష, చేసిన దౌర్జన్యంపై ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకొని కేసు నమోదుచేయాలని కోరారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌కు మాత్రమే పీసీసీ అధ్యక్షుడిగా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ మండిపడ్డారు. ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకే ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకున్నామని చెప్పారు.


మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం

మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మేడ్చల్‌ మున్సిపల్‌ కా ర్యాలయానికి టీఆర్‌ఎస్‌కు చెందిన 14 మంది కౌన్సిలర్లతోపాటు ఇద్దరు కాంగ్రెస్‌, నలుగురు ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ కౌన్సిలర్‌ హాజరయ్యారు. సోమవారం హాజరుకాని టీఆర్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణం చేయించారు. అనంతరం టీఆర్‌ఎస్‌తోపాటు ఇండిపెండెంట్‌ సభ్యులు మొత్తం 18 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన 20వ వార్డు కౌన్సిలర్‌ దీపికానర్సింహారెడ్డిని చైర్‌పర్సన్‌గా, 19వ వార్డు కౌన్సిలర్‌ చీర్ల రమేశ్‌ను వైస్‌చెర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

నల్లగొండ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక మళ్లీ వాయిదా

నల్లగొండ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సోమవారం కోరంలేక మంగళవారానికి వాయిదా పడగా.. రెండోరోజూ 20మంది కాం గ్రెస్‌ సభ్యులు మినహా సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో కోరంలేదని ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి వాయిదా వేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు జిల్లా ఎన్నికల యంత్రాంగం నివేదిక పంపనుండగా ఉన్నతాధికారు ల సూచనల మేరకు వైస్‌చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. 


logo