గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:03

మహాజనులను మేల్కొల్పిన మాదిగ దండోరా!

మహాజనులను మేల్కొల్పిన మాదిగ దండోరా!

దండోరా అంటే కేవలం అది ఒక శబ్దం మాత్రమే కాదు. అది ఒక మేల్కొల్పు సంకేతం. చైతన్య చిహ్నం. అనాదిగా అణగదొక్క బడుతూ ఉన్న పునాది కులం వేసిన పొలికేక.. దండోరా. 1994 జూలై 7న ప్రకాశం జిల్లా మారుమూల గ్రామం ఈదుమూడిలో ఏ మాత్రం పేరు ప్రతిష్ఠలు, యూనివర్సిటీ పట్టాలు, ఆర్థిక అండదండలు లేని ఓ ఇరవై మంది సాధారణ యువకుల సారథ్యంలో ఊపిరిపోసుకున్న దండోరా మొత్తం సమాజంలోనే అసాధారణ చలనాన్ని తీసుకొచ్చింది. ప్రతి అణగారిన కుల మూ మాదిగ దండోరా ఉద్యమం నుంచి ప్రేరణ పొంది తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, తనపై అమలు జరుగుతూ ఉన్న అణచివేతను ఎదిరించేందుకూ పూనుకొన్నది. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లోని ఎస్సీ కులంలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ జరగాలన్న ఏకైక డిమాండ్‌తో మొదలైన దండోరా ఉద్యమం, తన డిమాండ్‌ పరిధిని దాటి సామాజిక, ఆర్థిక రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో మాదిగల ఉనికిని మహోన్నతంగా నిలిపింది. 

కారంచేడు రుధిర క్షేత్రంలో మొలకెత్తిన దళిత ఉద్యమంలో మాదిగ జాతి మమేకమైంది. ఉమ్మడి ఎస్సీ గుర్తింపుతో అందుతున్న ఫలాలు.. ఎస్సీ గ్రూపులోని కులాలన్నిటికీ సమానంగా అందటం లేదని మాదిగ యువత గుర్తించింది. సామాజిక ‘హోదా’ విషయంలోనూ ఎస్సీ కులాల మధ్య హెచ్చుతగ్గులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనీ ఇది అమానవీయమనీ తీర్మానించుకుని సమాన పంపిణీ, సమాన గౌరవం కోసం సమరానికి సిద్ధమైంది. మన దేశంలో సామాజిక ఉద్యమాలలోకి రాజకీయాలు ప్రవేశించడం, లేదా సామాజిక ఉద్యమాలే రాజకీయ రూపుతీసుకోవడం సహజం. మాదిగ దండోరా విషయంలోనూ అదే జరిగింది. అనతికాలంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని ఏ రాజకీయపార్టీ కూడా మినహాయించలేని, పక్కకు పెట్టలేని స్థాయికి ఎదిగిన దండోరాను ప్రతి రాజకీయ పార్టీ అక్కున చేర్చుకోవాలని చూసింది. నాటి అధికార టీడీపీ దండోరా డిమాండ్‌ అయిన వర్గీకరణకు చర్యలు తీసుకుంది. అలా, వర్గీకరణ సాధించుకున్నప్పటికీ సామాజిక న్యాయ వ్యతిరేకులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వర్గీకరణ ఆగిపోయి, సమస్య ఇంకా రావణకాష్టంగా రగులుతూనే ఉన్నది.


ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉన్నది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకోసం మాదిగల న్యాయమైన కోర్కెను తీర్చడంతో కాలయాపన చేస్తున్నది. బీజేపీ సిద్ధాంతం, దాని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా చూసినపుడు అది మాదిగల డిమాండ్‌ను నెరవేర్చుతుందని భావించడం అత్యాశే. అలాగే ఉమ్మడి ఏపీలో రాజకీయపార్టీలను, ప్రభుత్వాలనూ ప్రభావితం చేసినంత బలంగా ఉద్యమం.. ఇప్పుడు లేదనీ అంగీకరించక తప్పదు. మొదటినుంచీ ఏకవ్యక్తి అధినాయకత్వం.. ఆ నాయకత్వపు విపరీత పోకడలు ఉద్యమాన్ని బలహీన పరిచాయి. కాబట్టే, ‘తెలంగాణ మాదిగ దండోరా’ను ఉమ్మడి నాయకత్వంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పట్నుంచీ వర్గీకరణతోపాటు మాదిగల ఇతర సమస్యలపైనా దృష్టి సారించి కృషిచేయడం జరుగుతున్నది. 

మన చైతన్యం, సంఘటితశక్తి మాత్రమే మన సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకూ ఏకైక మార్గం. దండోరా ఉద్యమానికి 26ఏండ్లు  నిండిన సందర్భంగా మనం మరింత బలంగా సంకల్పం చెప్పుకోవాలి. సంస్థాగతంగా బలపడి మన బలాన్ని చాటాలి. ఉద్యమం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జాతి పురోభివృద్ధికోసం పట్టుదలతో పనిచేయాలి. రాష్ట్రంలో దండోరా లేని గ్రామం ఒక్కటి కూడా లేదు. ఇదే మన బలం. ఈ బలాన్ని మనం సంఘటితపరచుకోవాలి. ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేయాల్సిన సందర్భం ఇది. కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా చుట్టేసి ప్రజల జీవితాలను కకావికలం చేస్తున్న నేపథ్యంలో, రెక్కలు తప్ప ఆస్తులు లేని మాదిగ జాతికి ప్రభుత్వ అండదండలు, సామాజిక సహకారం ఎంతో అవసరం. అందుకోసం ప్రతి మాదిగ కార్యకర్త ప్రయత్నించాలి. ఈ కష్టకాలంలో మనం ప్రజలతో నిరంతర సంబంధంలో ఉండటం అత్యవసరం. ఒక పలకరింపు, ఓదార్పు, చేయూతలే ఇప్పుడు ప్రాణదాతలు. చేయి అందిన మేర సాయం అందాల్సిందే. చూపు అందిన మేర నడక సాగాల్సిందే. సాగుదాం మనం ముందుకు మరింత చైతన్యంతో.. ఇంకింత సంఘటితంగా..

- వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ, టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు


logo