ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 15:21:44

దుబ్బాక‌లో గులాబీ గూటికి ముగ్గురు ఎంపీటీసీలు

దుబ్బాక‌లో గులాబీ గూటికి ముగ్గురు ఎంపీటీసీలు

సిద్దిపేట : దుబ్బాక‌లో టీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు అనుహ్యంగా పెరుగుతోంది. సీఎం కేసీఆర్ చేప‌డుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై ఇత‌ర పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మ‌రో ముగ్గురు ఎంపీటీసీలు గులాబీ గూటికి చేరారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భ‌వ‌న్‌లో ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు స‌మ‌క్షంలో చికోడ్ ఎంపీటీసీ రాంరెడ్డి, గోడగుపల్లి ఎంపీటీసీ అమ‌రేంద‌ర్ రెడ్డి లక్ష్మి నర్సయ్య, మిరుదొడ్డి  ఎంపీటీసీ సుధా నర్సింములుతో పాటు దాదాపు 500 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంద‌రికి మంత్రి హ‌రీష్‌రావు గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ఈ అనుహ్య మ‌ద్ద‌తును చూస్తుంటే దుబ్బాక‌లో గెలుపు ఖాయ‌మైంద‌ని అనిపిస్తోంద‌న్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 148 స‌ర్పంచ్‌లు ఉంటే 142 మంది టీఆర్ఎస్ లో ఉన్నారు. 70 మంది ఎంపీటీసీల్లో 67 మంది ఎంపీటీసీలు, 20 మంది కౌన్సిల‌ర్ల‌కు గానూ 19 మంది కౌన్సిల‌ర్లు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు.  99 శాతం మంది దుబ్బాక ప్ర‌జ‌లు కేసీఆర్ నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు అని మంత్రి పేర్కొన్నారు. దుబ్బాక‌లో ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉండి కూడా దుబ్బాక‌కు సాగు, తాగు నీరు ఇవ్వ‌లేదు. దుబ్బాక‌కు వ‌చ్చే బ‌దులు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌, రంగ‌నాయ‌క‌మ్మ సాగ‌ర్ ప్రాజెక్టులు చూడండి అని కాంగ్రెస్ నాయ‌కుల‌కు హ‌రీష్ రావు సూచించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎరువుల‌కు, విత్త‌నాల‌కు ఇబ్బందులు ప‌డ్డాం. ఇప్పుడు ఎరువులు, విత్త‌నాల స‌ర‌ఫ‌రాలో ఎలాంటి ఇబ్బంది లేదు. రైతుల‌కు నాణ్య‌మైన 24 గంట‌ల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నామ‌ని తెలిపారు. రైతుల ఉసురు పోసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలా? అని ప్ర‌శ్నించారు. బావుల కాడ మీట‌ర్లు పెట్టే బీజేపీకి ఓటేసే ముందు ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించుకోవాలి. కేంద్రం తీసుకొచ్చిన అగ్రిక‌ల్చ‌ర్ బిల్లుల‌తో పాటు విద్యుత్ చ‌ట్టం వ‌ల్ల రైతుల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్ల‌నుంద‌ని మంత్రి పేర్కొన్నారు. ఇవాళ పార్టీలో చేరిన ఎంపీటీసీల‌తో క‌లిసి పాత కొత్త అనే తేడా లేకుండా దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి స‌మిష్టిగా కృషి చేయాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. సుజాత‌కు అండ‌గా ఉంటూ.. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి  హ‌రీష్‌రావు పేర్కొన్నారు. 


logo