బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 18:14:56

పీవీ నరసింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాలి.. ఎంపీ శ‌శిథ‌రూర్ డిమాండ్‌

పీవీ నరసింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాలి.. ఎంపీ శ‌శిథ‌రూర్ డిమాండ్‌

హైద‌రాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ‌ప్ర‌భుత్వం భారత‌ర‌త్నఇవ్వాల‌ని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని శ‌త జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ ఏర్పాటు చేసిన “ఇండియన్ ఫారిన్ పాలసీ అండ్ పీవీ నరసింహారావు” అనే వెబ్‌నార్‌లో శ‌శిథ‌రూర్ పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భారత విదేశాంగ విధానంపై పీవీ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆ సమ‌యంలో పీవీ నైపుణ్యంతో అమ‌లు చేసిన విధానాలు దేశ భ‌విష్య‌త్ అభ్యున్న‌తికి దోహ‌ద‌ప‌డ్డాయ‌న్నారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు, ప్ర‌పంచ దేశాల మ‌ధ్య పొత్తులు, దేశ విదేశాంగ విధానంపై ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేశారని తెలిపారు.  

హృదయపూర్వక సంస్కరణవాది పీవీ అన్నారు. భారత రాజకీయ చరిత్రలో అత్యున్నత దక్షిణ భారతీయులలో ఒకరు పీవీ అని పేర్కొన్నారు. విశేష ల‌క్ష‌ణాల‌ను క‌లిగిఉండి భారతదేశాన్ని నిజంగా గర్వించేలా చేసిన వ్య‌క్తి అన్నారు. భాషలపై అత‌ని పట్టు, పొత్తుల అంశంలో చూపిన నైపుణ్యం, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌తో ధైర్యంగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టించి భారతదేశాన్ని ప్రాథ‌మికంగా మార్పు వైపు ప‌య‌నింప‌జేశార‌న్నారు. ఆయ‌న వినయం భారత నీతిని, దేశ పురోగతి కోరికను బలపరిచిందన్నారు. 

దేశానికి అణ్వాయుధ సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందించ‌డంలో పీవీ నరసింహారావు సైతం కీలక పాత్ర పోషించారన్నారు. ఇజ్రాయెల్ సహకారంతో భారత సాయుధ దళాలను బలోపేతం చేశారన్నారు. 1993 లో చైనాను సందర్శించడం ద్వారా ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించార‌న్నారు. పీవీ నరసింహారావు తన సుదీర్ఘమైన కెరీర్‌లో వివిధ స్థాయిల్లో ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించిన వినయపూర్వకమైన వ్య‌క్తి అన్నారు. మ‌ర‌ణానంత‌రం భార‌త‌ర‌త్న ప్ర‌దానం చేయాల్సిందిగా ఆయ‌న కేంద్రాన్ని డిమాండ్ చేశారు. logo