ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 02:56:55

ఒక్క ట్వీట్‌తో చెట్ల నరికివేతకు చెక్‌

ఒక్క ట్వీట్‌తో చెట్ల నరికివేతకు చెక్‌

  • వెంటనే స్పందించిన ఎంపీ సంతోష్‌కుమార్‌
  • మేయర్‌ ఆదేశాలతో కదిలిన అధికారులు
  • బాధ్యులకు 25వేల జరిమానా

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: చెట్లు నరికేస్తున్నారంటూ ఓ సామాన్యురాలు చేసిన ట్వీట్‌కు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ తక్షణమే స్పందించారు. చెట్ల నరికివేతను నిలిపివేయించి, బాధ్యులకు జరిమానా విధించేలా చర్యలు తీసుకున్నారు. ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీ ఫేస్‌2లో ఏపుగా పెరిగిన చెట్లను గురువారం కొందరు నరికేస్తుండగా అదే కాలనీకి చెం దిన సురభి మెట్‌పల్లి గమనించారు. వీడియో తీసిన ఆమె ట్విట్టర్‌ ద్వారా గ్రీన్‌ చాలెంజ్‌కు ఆద్యుడైన సంతోష్‌కుమార్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన.. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. చెట్ల నరికివేతను నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ను మేయర్‌ ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లిన జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి.. బాధ్యులకు రూ.25 వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. కాగా, ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు సురభి మెట్‌పల్లి ధన్యవాదాలు తెలిపారు. నెటిజన్లు సైతం హర్షం వ్యక్తంచేశారు.


logo