గురువారం 16 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:51:15

మీ ‘హరిత స్ఫూర్తి’ అసమానం

మీ ‘హరిత స్ఫూర్తి’ అసమానం

  • కాళ్లతోనే మొక్క నాటిన దివ్యాంగుడు జకీర్‌ పాషా  
  • ప్రశంసించిన ఎంపీ సంతోష్‌కుమార్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సంకల్పంతో వైకల్యాన్ని జయించిన ఓ యువకుడు.. ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌'లో పాల్గొని కాళ్లతోనే మొక్క నాటాడు. ఆయన అసమాన హరిత స్ఫూర్తిని రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రశంసించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన జకీర్‌పాషాకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినా కుంగిపోకుండా కాళ్లతోనే రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ, బైక్‌ నడుపుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌లో పాల్గొన్నారు. సోమవారం ఇంటి ఆవరణలో ఓ మొక్క నాటారు. 

కాళ్లతోనే మొక్కనాటిన జకీర్‌పాషాను ఎంపీ సంతోష్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు. ‘గ్రీన్‌ఇండియా చాలెంజ్‌తో స్ఫూర్తి పొంది, కార్యక్రమ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొని తనవంతుగా మొక్క నాటిన జకీర్‌పాషాకు అభినందనలు. వైకల్యం ఆయనకు ఆటంకం కాలేదు. అసమానస్ఫూర్తిని ప్రదర్శించి కొన్ని లక్షల మందికి మార్గదర్శిగా నిలిచారు’ అని ఎంపీ సంతోష్‌ ట్వీట్‌చేశారు. 


logo