శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:47:20

రేవంత్‌ సరెండర్‌

రేవంత్‌ సరెండర్‌

జవాబు చెప్పలేని పెద్ద తప్పు బయటపడకూడదనుకుంటే, చిన్న నేరమొకటి చేయాలి. ఆ నేరం నేనే చేశానంటూ పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళ్లాలి. ఎందుకంటే.. ఏ ప్రశ్నలూ ఎదురుకాని సురక్షిత ప్రదేశం జైలుకు మించి ఎక్కడుంటుంది! అదేదో సినిమాలో ఇదే సన్నివేశం చూశామే అనుకుంటున్నారా? సినిమాదాకా ఎందుకు? కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అచ్చం ఇదేచేశారు. భూదందాపై జవాబు చెప్పుకోలేని దుస్థితిలో చిక్కుకుని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రోన్లతో డ్రామా చేసి, పోలీసులు నోటీసులివ్వకున్నా ఠాణాకు వెళ్లి లొంగిపోయి, అడిగిమరీ అరెస్టు చేయించుకుని, ఎంపీగా వెంటనే బెయిలు తీసుకునే అవకాశమున్నా తీసుకోకుండా సానుభూతి పాచిక విసిరి, అంతిమంగా అభాసుపాలయ్యారు.

  • నోటీసులు ఇవ్వకుండానే నార్సింగి స్టేషన్‌కు కాంగ్రెస్‌ ఎంపీ
  • గోపన్‌పల్లి భూకబ్జా నుంచి బయటపడేందుకు డ్రోన్‌ డ్రామా
  • బెయిల్‌కు అవకాశమున్నా దరఖాస్తు చేయడంలో తాత్సారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిబంధనలు తుంగలో తొక్కుతూ..వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించేలా తన మనుషులతో డ్రోన్ల ద్వారా చిత్రీకరించి అడ్డంగా దొరికిన కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి రాజకీయ డ్రామాకు తెరతీశారు. పోలీసులు తనను వెంటాడి మరీ అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకొచ్చారని రేవంత్‌రెడ్డి కార్యకర్తలు, కాంగ్రెస్‌ నేతలకు చెప్పిందంతా అబద్ధమని, అసలు ఆయనకు నోటీసులే ఇవ్వలేదంటూ నార్సింగి పోలీసులు చెప్తుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్‌రెడ్డి నేరుగా నార్సింగ్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తనపై డ్రోన్ల వాడకానికి సంబంధించిన కేసుపెట్టారని.. తనను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. అప్పటికే ఆయనపై కేసు ఉండటంతో పోలీసులు రిమాండ్‌ చేశారు. ఎంపీ అయిన రేవంత్‌రెడ్డికి వాస్తవంగా ముందుగానే న్యాయస్థానం నుంచి బెయిల్‌ పొందే అవకాశం ఉన్నది. కానీ, గురువారం ఆయన బెయిల్‌కు దరఖాస్తు చేసుకోకపోవడం ఒక డ్రామాలా ఉన్నదని రాజకీయవిశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


కబ్జా అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకే!

డ్రోన్లతో చిత్రీకరణ కేసు తనకు రాజకీయంగా ఉపయోగపడుతుందని భావించిన రేవంత్‌రెడ్డి అంతా పథకం ప్రకారం వ్యవహరించినట్టు కన్పిస్తున్నది. గోపన్‌పల్లిలో రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు సుమారు ఏడెకరాల కబ్జాకు పాల్పడిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులు కూడా దర్యాప్తుచేసి దీనిని రుజువుచేశారు. ఈ అంశంపై ప్రజలకు సమాధానం చెప్పలేని రేవంత్‌రెడ్డి డ్రోన్ల బాగోతాన్ని మొదలుపెట్టారని అంటున్నారు. రేవంత్‌ సోదరుడు అనుముల కృష్ణారెడ్డి సూచనల మేరకు డ్రోన్‌ వాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టుచేశారు.


కేసులో రేవంత్‌ పేరు ఉన్నప్పటికీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. కానీ, ఆయనే నేరుగా నార్సింగి పీఎస్‌కు వచ్చి లొంగిపోతానంటూ చెప్పారు. పోలీసు అధికారులు నిబంధనలు వివరిస్తున్నా.. వితండవాదానికి దిగి తనకు తానే అరెస్టయ్యారు. భూకబ్జా ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే గురువారం బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. తనకు కావాల్సినంత ప్రచారం వచ్చాక శుక్రవారం మధ్యాహ్నం బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదావేసింది. ఇదే కేసులో అరెస్టయిన ఆరుగురికి రాజేంద్రనగర్‌ కోర్టు శుక్రవారమే బెయిల్‌ మంజూరుచేసింది. 


డ్రోన్ల వాడకంపై నిబంధనలు ఇవీ..

కేంద్రప్రభుత్వం 2018లో డ్రోన్‌ పాలసీని తీసుకొచ్చింది. డ్రోన్‌ వాడకానికి సంబంధించి దాని అపరేటర్‌ కేంద్ర హోంశాఖ నుంచి ముందుగానే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (యూఐఎన్‌) తీసుకోవాలి. అందులో డ్రోన్‌సైజ్‌, సామర్థ్యం, ఎందుకు చిత్రీకరించాలనుకుంటున్నరు? తదితర వివరాలన్నీ నమోదుచేయాలి. భూ ఉపరితలం నుంచి 200 ఫీట్ల ఎత్తులోకి ఎగరాలంటే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి అన్‌నేమ్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆపరేటర్‌ పర్మిట్‌ (యూఏవోపీ) ఉండాలి. అంతకంటే తక్కువ ఎత్తు అయితే స్థానిక పోలీసుల అనుమతి అవసరం. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 5ఏతోపాటు, ఐపీసీ 11(ఏ) కింద కేసులు నమోదుచేస్తారు. ఈ సెక్షన్ల కింద రెండేండ్లు జైలు, లేదా జరిమానా ఉంటుంది. ఐపీసీ సెక్షన్లు 188,287. 338 కింద కూడా కేసులు నమోదు చేయవచ్చు. 


రేవంత్‌కు అసలు నోటీసులే ఇవ్వలేదు: ఏసీపీ మాదాపూర్‌ 

డ్రోన్‌ ఎవరు వాడారన్నదానిపై దర్యాప్తు చేసి ఆరుగురిని అరెస్టుచేశామని, ఎంపీ రేవంత్‌రెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఆయనే స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సరెండర్‌ అయ్యారని మాదాపూర్‌ ఏసీపీ శ్యాంప్రసాద్‌ తెలిపారు. ‘అరెస్టు నోటీసులు కూడా వద్దు.. బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోను’ అని రేవంత్‌రెడ్డి చెప్పారని పేర్కొన్నారు.


logo