బుధవారం 03 జూన్ 2020
Telangana - May 24, 2020 , 00:47:38

మోదీవి ఫ్యూడల్‌ పోకడలు

మోదీవి ఫ్యూడల్‌ పోకడలు

  • బీజేపీవి కాంగ్రెస్‌ కంటే ఘోరమైన తప్పులు
  • చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి విమర్శ

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫెడరల్‌ వ్యవస్థ కావాలంటూ చెప్పిన నరేంద్రమోదీ.. ప్రధాని అయ్యాక ఫ్యూడల్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్‌ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నదని.. విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం రంజిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలసకార్మికులను ప్రధాని మోదీ కనీసం వారి సొంతూళ్లకు కూడా చేర్చలేదని మండిపడ్డారు. కరోనా పేరిట మీడియాలో కనిపిస్తూ తీయటి మాటలు చెప్తున్నారు కానీ, పనులు మాత్రం చేయడం లేదని ఎద్దేవాచేశారు. కరోనాతో రాష్ర్టాలు ఇబ్బందులు పడుతుంటే.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచేందుకు నానారకాల ఆంక్షలు పెడుతున్నారని చెప్పారు. 

కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చుకొనే వెసులుబాటు కల్పించుకుంటున్నదని ఆరోపించారు. ఆరురాష్ట్రాలకే 56 శాతం నిధులు ఇచ్చి.. మిగిలిన రాష్ర్టాలకు కేంద్రం మొండిచేయి చూపుతున్నదని అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో నిలదీస్తామని చెప్పారు. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ కేంద్రం నుంచి రాష్ర్టానికి తెచ్చే నిధుల గురించి మాట్లాడకుండా.. అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారం కంటే ప్రజాసేవ చేయడంలోనే ఎంతో తృప్తి ఉన్నదని.. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని రంజిత్‌రెడ్డి తెలిపారు.


logo