గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 02:22:13

‘బయోమాస్‌ పవర్‌'లో మార్పులు

‘బయోమాస్‌ పవర్‌'లో మార్పులు

  • లోక్‌సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్‌
  • సమూల మార్పులకు చర్యలు: కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ హామీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘బయోమాస్‌ పవర్‌ప్లాంట్‌ పథకాల్లో లోటుపాట్లు ఉన్నాయి. ఇది సక్రమంగా అమలు చేయకపోవడంతో షుగర్‌ ఫ్యాక్టరీలు, వాటినే నమ్ముకొన్న రైతులు ఇబ్బందిపడుతున్నారు. బయోమాస్‌ పవర్‌ప్లాంట్‌కు ఊరటనిచ్చేలా సంస్కరణలు చేపట్టాలి’అని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల్లో నామా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సమస్యలతో సతమతమవుతున్న చెరకు ఫ్యాక్టరీలను, రైతులను ఆదుకొనేందుకు ప్రస్తుత విధానంలో మార్పులుతేవాలని కోరారు. కేంద్ర మంత్రి ఆర్కే సిం గ్‌ మాట్లాడుతూ బయోమాస్‌ పవర్‌ప్లాంట్‌ విధానంలో సమూలమార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.

కొత్త ఎంపీలకు శుభాకాంక్షలు

తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కే కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డిలకు నామానాగేశ్వరరావు ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అప్పగించిన బాధ్యతను సగర్వంగా నిర్వర్తిస్తూ రాజ్యసభలో తెలంగాణవాణిని వినిపిస్తూ నిర్మాణత్మకమైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. వీరిఎన్నికతో పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ బలం పెరిగిందని, రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కీలకమైన పాత్ర పోషిస్తామని తెలిపారు. నిజామాబాద్‌ స్థానికసంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న కవితకు అభినందనలు తెలిపారు. భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని, తెలంగాణ ఉద్యమంలో ఆమె పోరాటపటిమ అనిర్వచనీయమైన స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.

ఆయుర్వేద వైద్యం బలోపేతం 

  • ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి 


తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్తగా ఆయుర్వేద దవాఖానలు, పరిశోధన సంస్థను ఏర్పాటుచేయాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆయుర్వేద రిసెర్చ్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుబిల్లుపై ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖానలో 100 పడకలు ఉండగా, నిత్యం 350 మంది వరకు వస్తున్నారని, మౌలికవసతులు పెంచేందుకు నిధులు అధికంగా కేటాయించాలని కోరా రు. దీన్ని జాతీయ ఆయుర్వేద వైద్య ఇన్‌స్టిట్యూట్‌గా అభివృద్ధి చేయాలని, వరంగల్‌, తూప్రాన్‌  ఆయుర్వేద దవాఖానల స్థాయి పెంచాలని కోరారు. 

ఎమ్మెస్‌ఎంఈ రంగానికి నిధులు

  • ఎంపీ బండా ప్రకాశ్‌ 


దేశంలో ఎమ్మెస్‌ఎంఈ రంగం ద్వారా 12 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, రూ.37 లక్షల కోట్లు పెట్టుబడులు అవసరమైతే.. రూ.17.4లక్షల కోట్లే అందుబాటులో ఉన్నాయని టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ చెప్పారు. రాజ్యసభలో ఎమ్మెస్‌ఎంఈ రంగంపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెస్‌ఎంఈకి రూ.12వేల కోట్లు అవసరమైతే, రూ.7,500 కోట్లే కేటాయించి వివక్ష ప్రదర్శించారని ఆరోపించారు. ఎమ్మెస్‌ఎంఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని,ఇన్నోవేషన్‌ పాలసీ ఆవిష్కరించిందని, స్టార్టప్‌లను, ఇంక్యుబేటర్‌లను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.

ఫార్మాసిటీకి అనుమతులు 

  • రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ 


హైదరాబాద్‌ ఫార్మాసిటీకి పూర్తి అనుమతులు ఇవ్వాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ కోరారు. రాజ్యసభ జీరోఅవర్‌లో ఆయన మాట్లాడుతూ ఫార్మారంగంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు నెలకొల్పాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, పర్యావరణహిత పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే 8,400 ఎకరాలు సేకరించిందని చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌ కూడా  తయారైందని, కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరుచేసిందని చెప్పారు. 300 ఫార్మా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చాయని వివరించారు.


logo