శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:46:55

పీవీ అద్భుతాలు సాధించిన వ్యక్తి: కేకే

పీవీ అద్భుతాలు సాధించిన వ్యక్తి: కేకే

  • జర్మనీలో లాంఛనంగా ఉత్సవాలు ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అద్భుతాలు సాధించిన మహానుభావుల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఒకరని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు అన్నారు. పీవీ గొప్పతనాన్ని 360 డిగ్రీల కోణంలో ఆవిష్కరించటమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. జర్మనీ, లండన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలను వర్చువల్‌ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో కేకేతోపాటు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు మహేశ్‌ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. పీవీ అమూల్యమైన అముద్రిత వ్యాసాల ప్రచురణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో ఉత్సవాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వివిధ రంగాల ప్రముఖుల కోణంలో పీవీని ఆవిష్కరిస్తూ కాఫీ టేబుల్‌ బుక్‌ తీసుకొస్తామని తెలిపారు. చెన్నమనేని రమేశ్‌బాబు మాట్లాడుతూ పీవీకి జర్మనీతో ప్రత్యేక అనుబంధం ఉన్నదన్నారు. 

జర్మనీ పర్యటనల్లో పీవీ నరసింహారావు ప్రసంగాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయని తెలిపారు. జర్మనీ పర్యటనల సందర్భంగా సంస్కృతం, అంతర్జాతీయ నాగరికత, జర్మనీ తత్వవేత్తల గురించి పీవీ ప్రసంగాలు సుమారు 100 పేజీల వరకు ఉంటాయని చెప్పారు. వీటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని తెలిపారు. జర్మనీలో పీవీ విగ్రహం ఏర్పాటు, ఏదైనా ప్రధాన నగరంలో ఓ వీధికి ఆయన పేరు పెట్టేలా అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదిస్తానని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు మహేశ్‌ బిగాల మాట్లాడుతూ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, గల్ఫ్‌ సహా వివిధ దేశాల్లో ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవీ మనుమడు కశ్యప్‌, టీఆర్‌ఎస్‌ జర్మనీ ఎన్‌ఆర్‌ఐ అధ్యక్షుడు అరవింద్‌ గుంత, మన తెలుగు అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నరేశ్‌ మేసినేని , శ్రీనివాస్‌ ఉమ్మెంటుల, గిరీశ్‌ బండి, అనిల్‌ కుందేటి, సుజిత్‌ అన్నమనేని, వినయ్‌ రామాయంపేట పాల్గొన్నారు.


logo