సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 02:46:38

వ్యవసాయం.. కార్పొరేట్ల గుప్పిట్లోకి

వ్యవసాయం.. కార్పొరేట్ల గుప్పిట్లోకి

  • కేంద్రం వ్యవసాయ బిల్లుపై కేకే ధ్వజం 
  • రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తామని వెల్లడి
  • కంపెనీల చేతికి చిన్న, సన్నకారు రైతుల భూమి
  • టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా మండిపాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పెద్ద కంపెనీలు, కార్పొరేట్లు వ్యవసాయంపై ఆధిపత్యం చలాయించే పరిస్థితిని కేంద్రప్రభుత్వం కల్పిస్తున్నదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ఆవరణలో శనివారం టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి కే కేశవరావు, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్స్‌ల రాజ్యాన్ని నడిపిస్తున్నదని కేశవరావు ఆరోపించారు. రైతాంగానికి తీవ్రనష్టం కలిగించే బిల్లులను తీసుకొస్తున్నదని విమర్శించారు. ఆదివారం రాజ్యసభ ముందుకు వచ్చే రైతు బిల్లును టీఆర్‌ఎస్‌  తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు. ఇప్పటివరకు మార్కెట్లు, వ్యవసాయ సంబంధిత అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేవని, కేంద్రం తీసుకొచ్చే బిల్లులతో అన్నీ కేంద్రం చేతికి వెళ్లిపోయి రాష్ర్టాల పాత్ర తగ్గుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 

రైతులపై కక్షతో కేంద్రం

కేంద్ర ప్రభుత్వం రైతాంగంపై కక్షతో వ్యవహరిస్తున్నదని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు విమర్శించారు. దేశంలోని రైతులను బిచ్చగాళ్లు, కూలీలను చేద్దామనుకుంటున్నారా? అని కేంద్రాన్ని నిలదీశారు. లోక్‌సభలో మెజార్టీ ఉన్నది కదా అని బిల్లులను పాస్‌ చేయించుకున్నారని, కానీ రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఈ బిల్లుతో కంపెనీ వ్యవస్థను తీసుకొచ్చి చిన్న, సన్నకారు రైతుల భూములను కంపెనీలకు అప్పగించేలా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం శుక్రవారం 50లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కజొన్న దిగుమతికి ఆర్డినెన్స్‌ ఇచ్చిందని, దిగుమతి సుంకాన్ని 15% తగ్గించారని చెప్పారు. దీనిద్వారా ఇక్కడి ప్రైవేటు కంపెనీలు, విదేశీ రైతులు బాగుపడ్డారని విమర్శించారు. 

ఆర్థిక వృద్ధిరేటు మైనస్‌ 24 శాతానికి పడిపోతే వాళ్లకు ఎందుకు సుంకం తగ్గించారని నామా ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా తెలంగాణలో 9 లక్షల టన్నుల మక్కజొన్న కొనుగోలు చేశామని నామా చెప్పారు. బీజేపీ తీసుకొచ్చిన బిల్లును ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ వ్యతిరేకించిందని, ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి రాజీనామా కూడా చేశారని నామా గుర్తుచేశారు. ఈ బిల్లుపై కలిసి వచ్చే పార్టీలతో రైతులకు అండగా ఉంటామని నామా చెప్పారు. మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు సంతోష్‌కుమార్‌, పీ రాములు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, మాలోతు కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీ లింగయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo