శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 18, 2020 , 01:57:12

సీఏఏపై నిర్ణయం చారిత్రాత్మకం

సీఏఏపై నిర్ణయం చారిత్రాత్మకం
  • సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ.. సీఎం కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ సవరణను రద్దుచేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం స్వాగతించదగిన పరిణామమని చెప్పారు. 


కేరళలో మాదిరిగా ఎన్పీఆర్‌ ప్రక్రియను నిలిపివేసేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ జామియా మిలియా వర్సిటీలో విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జి జరిపిన పోలీసులపై కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్రమంగా వర్సిటీలోకి ప్రవేశించడమే కాకుండా విద్యార్థులతో దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరారు. బయటకు వెళ్తామని విద్యార్థినులు బతిమిలాడినా లాఠీలతో కొట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు.


మంత్రివర్గ తీర్మానం హర్షణీయం: సీపీఐ

సీఏఏను రద్దుచేయాలని క్యాబినెట్‌ సమావేశంలో తీర్మానించడం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పౌరసత్వం విషయంలో మతపరమైన వివక్ష తగదని పేర్కొనడాన్ని సీపీఐ స్వాగతిస్తున్నదని చెప్పారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలనే నిర్ణయం మంచిదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ మొండిగా వ్యవహరిస్తున్నందున సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణలో లౌకిక పార్టీలతో కలిసి ఉద్యమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు.


logo