గురువారం 21 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 18:16:47

నగరాన్ని కాపాడుకునేందుకు తరలిరండి : మంత్రి కేటీఆర్‌

నగరాన్ని కాపాడుకునేందుకు తరలిరండి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : మతపిచ్చొళ్ల మధ్యన నలిగిపోకుండా చూసుకోవడానికి హైదరాబాద్‌ నగరాన్ని కాపాడుకునేందుకు అర్హులైన అందరూ డిసెంబర్‌ 1న జరిగే గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని శాంతినగర్‌ చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తార్నాక నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మోతే శ్రీలతా శోభన్‌రెడ్డి, మెట్టుగూడ నుంచి రాచూరి సునీత.. సీతాఫల్‌మండి నుంచి సామల హేమ, అడ్డగుట్ట నుంచి ప్రసన్న, బౌద్ధానగర్‌ నుంచి కంది శైలజను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. 

ఐదేండ్లక్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు వచ్చాం. హైదరాబాద్‌లోని పేద అక్కాచెల్లెళ్లను, అన్నాదమ్ములను కడుపులో పెట్టి చూసుకుంటామన్నాం. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి కష్టపడి ఒళ్లువంచి పనిచేస్తామని చెప్పినం. ఆనాడు ఎన్ని రకాల అనుమానాలు ఉండే.. వాటన్నింటిని పటాపంచలు చేసి అభివృద్ధిని నేడు మీ కండ్లముందుంచామన్నారు. ఇంకా సమస్యలు లేవని కావు. విశ్వనగరాలు ఒక రాత్రిలోనో, ఒకరోజులోనో అయిపోవు. ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నం. మీ కష్టంలోనూ, దుఖంలోనూ ఉంది మేము. కరోనా ఆపతిలో ఉన్నాం. వరదల దుఃఖంలోనూ అండగా ఉన్నాం. మీరు కష్టంలో ఉంటే మీ కన్నీళ్లను తుడిచింది మేము. రేపు ఆదుకునేది కూడా మేమే. 

మీకోసం ఇన్ని రకాలుగా అండగా ఉన్నాం. ఆపదంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే పార్టీ మాది. మీ దయ ఉంటే.. మళ్లా గెలిపిస్తే పనిచేస్తామని మేం అంటున్నం. మరి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఏం చేశారో, ఏం చేస్తారో సమాధానం చెప్పమంటే చెప్పరు. చాలా మంది హైదరాబాద్‌లో ఓటు రోజు అంటే హాలిడే అని ఇంట్లో పడుకుంటారు. ఈ నగరాన్ని కాపాడుకోవడానికి, ఈ మతపిచ్చోళ్ల మధ్యన నలిగిపోకుండా చూసుకోవడానికి పోలింగ్‌ రోజు బయటకు రాండి. వచ్చి ఓటు వేయండి. ఓటు అనే వజ్రాయుధంతో ఈ మతపిచ్చిగాళ్లను తిప్పితిప్పి కొట్టండని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 


logo