బుధవారం 08 జూలై 2020
Telangana - Apr 30, 2020 , 00:56:53

వలస కూలీకి దన్నుగా..

వలస కూలీకి దన్నుగా..

  • ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలాలకు తరలింపు
  • చొరవ తీసుకొన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి 

వలస జీవులైనా, రైతు కూలీలైనా.. తమకు అందరూ ఒక్కటే అంటున్న తెలంగాణ ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకొన్నది. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకొంటున్న వలస కూలీలు కూడా మా బిడ్డలే అంటూ.. కరోనా కట్టడి సమయాన వారికి అండగా నిలుస్తున్నది. కష్టజీవుల కన్నీళ్లు తుడుస్తూ.. వారు కోరుకొంటున్నట్లుగా వాళ్ల ఇంటికి పంపిస్తున్నది.

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ నర్సంపేట రూరల్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్రఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు తెలంగాణ ప్రభుత్వం దన్నుగా నిలిచింది. వారిని ఆదరించి, ఆశ్రయమిచ్చి, అన్నంపెట్టి, వారు కోరుకొన్నట్లుగా స్వగ్రామాలకు తరలించింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో సీఎం కేసీఆర్‌ వలస కూలీల తరలింపునకు ఆదేశించారు. ఈ మేరకు అధికారులు మూడు ఆర్టీసీ బస్సులను సిద్ధంచేసి 90 మందిని వారి ఊరికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తమపట్ల చూపిన ఔదార్యాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని కండ్ల నీళ్లు పెట్టుకొని చెప్తున్నారు వలస కూలీలు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వలస కూలీలను వారి స్వంత గ్రామాలకు ఆర్టీసీ బస్సుల్లో తరలించడం ఇదే ప్రథమం. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం గోజెగాం గ్రామానికి చెందిన 90 మంది గిరిజనులు కూలీ పనులనిమిత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడుకు వెళ్లారు. 

ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకంటించడంతో వారికి ఉపాధి కరువైంది. ప్రభుత్వం వీరికి 12 కిలోల ఉచిత బియ్యంతోపాటు రూ.500 నగదు అందజేసింది. జూలూరుపాడులో ఉండలేక పిల్లాపాపల్ని నెత్తినెత్తుకొని కాలినడకన అటవీమార్గం గుండా తమ సొంతూరికి బయల్దేరారు. దొరికింది తింటూ వారంపాటు నడక కొనసాగించిన వీరు.. మంగళవారం సాయంత్రానికి నర్సంపేటకు చేరుకొన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ లాక్‌డౌన్‌ పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. వలస కూలీలను చూసి వారితో మాట్లాడారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికివెళ్లాలి.. అనే వివరాలు తెలుసుకున్నారు. 

నర్సంపేటలో అన్నం, ఆశ్రయం

కాలి నడకన స్వగ్రామానికి వెళ్తున్నామని వలసకూలీలు చెప్పడంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే పట్టణంలో వారికి ఆశ్రయం కల్పించి భోజన ఏర్పాట్లుచేశారు. వీరి ఇబ్బందుల ను సీఎం కేసీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, గిరిజన సంక్షేమశాఖ మం త్రి సత్యవతి రాథోడ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారిని పంపేందుకు ఏర్పాట్లుచేయాలని సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పారు. దాంతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ హరిత దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఉదయం కూలీలందరికీ ఎమ్మెల్యే దగ్గరుండి మరీ భోజనాలు వడ్డించి, మూడు బస్సుల్లో మొత్తం 90 మందిని వారి స్వగ్రామానికి సాగనంపారు. దీంతో లాక్‌డౌన్‌తో అవస్థలు పడిన వలస కూలీలు సంతోషం వ్యక్తంచేసి సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


logo