మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:13:24

ఎంజీకేఎల్‌ఐలో మోటర్‌ రెడీ

ఎంజీకేఎల్‌ఐలో మోటర్‌ రెడీ

  • రేపటినుంచి నీటి విడుదలకు సన్నాహాలు

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్‌లో ఐదు మో టర్లకుగాను ఒక మోటర్‌ మరమ్మతులు దాదాపు పూర్తయ్యాయి. ఆ మోటర్‌ ద్వారా ఈ నెల 20నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టులో మొదటిదైన ఎల్లూరు (0.18 టీఎంసీల సామ ర్థ్యం) పంప్‌హౌజ్‌లోకి గతనెల 16న సాంకేతిక సమస్యతో నీళ్లు వచ్చాయి. దీంతో రిజర్వాయర్‌లోని ఐదు మోటర్లు మునిగిపోయాయి. ఎంజీకేఎల్‌ఐ పరిధిలోని జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు సైతం నీటి విడుదల నిలిచిపోయింది. ఈ కారణంగా మంచినీటికి తొలి సమస్య ఏర్పడింది. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఎల్లూరు నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లాతోపాటు షాద్‌నగర్‌, కొడంగల్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మహబూబ్‌నగర్‌, రాజేంద్రనగర్‌, జడ్చర్ల, మ క్తల్‌, నారాయణపేట వంటి ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాలు 3,600కుపైగా గ్రామాలు, 19 మున్సిపాల్టీలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. 

తాత్కాలిక ఏర్పాట్లతో ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో మంచినీటిని అందిస్తున్నారు. యాసంగి సాగుకు ప్రాజెక్టు నీటి విడుదలపై కాస్త సందేహాలు నెలకొనగా.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేల పర్యవేక్షణతో నీటి తోడివేత, మోటర్ల మరమ్మతు పనులు వేగంగా పూర్తయ్యాయి. రాష్ట్ర ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి ఇక్కడే మకాంవేసి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పదిరోజుల్లోనే నీటిని తోడివేశారు. శుక్రవారం నుంచి ఒక మోటర్‌ను నడిపించనున్నారు.