సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 21:07:21

కుటుంబ కలహాలతో తల్లీబిడ్డల ఆత్మహత్య

కుటుంబ కలహాలతో తల్లీబిడ్డల ఆత్మహత్య

చింతలమానేపల్లి: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన వివాహిత శ్యామల(30), తన చిన్న కూతురు అనూషతో కలిసి ప్రాణహితలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ కథనం ప్రకారం..మహారాష్ట్రలోని ఏలె గ్రామానికి చెందిన శ్యామలకు, బూరెపల్లికి చెందిన దివ్యాంగుడైన నక్క రాజుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు శ్రీవిద్య(5), అనూష(2) ఉన్నారు. రాజు కేవలం ఆసరా పింఛన్‌పైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో నిత్యం భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా గొడవపడడంతో తన చిన్న కూతురుని వెంటబెట్టుకొని బయటకు వెళ్లింది.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ప్రాణహితలో తల్లీకూతుళ్ల మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. సంఘటనా స్థలాన్ని కాగజ్‌నగర్‌ డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి పరిశీలించారు. గురువారం సాయంత్రం నుంచి శ్యామల, అనూష కనపడకపోవడంతో రాజు కూడా అదృశ్యమయ్యాడని అతడి సోదరుడు మల్లేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి దగ్గర శుక్రవారం ఉదయం కనబడ్డట్లు గ్రామస్తులు తెలిపారు. గజ ఈతగాళ్లతో బావిలో గాలించగా ఆచూకీ లభించలేదు. శ్యామల తండ్రి బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.