మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 02:41:32

పనికిరాని ఆవేశం..పసి పాపను చంపేసింది

పనికిరాని ఆవేశం..పసి పాపను చంపేసింది

  • తల్లికి ఫేస్‌బుక్‌లో ఇద్దరితో పరిచయం
  • ఒకరితో సన్నిహితంగా ఉందని మరొకరి ఆగ్రహం
  • ఏకంగా కత్తితో ఇంటికి వచ్చిన ఆగంతకుడు
  • తల్లిని బెదిరించే క్రమంలో చిన్నారి హత్య
  • మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కలకలం.. 
  • తల్లి స్నేహాలే హత్యకు కారణమా?: పోలీసుల దర్యాప్తు

అసలేం జరుగుతున్నదో తెలియదు.. అమ్మతో గొడవ పడుతున్నదెవరో ఎరుగదు.. తెలియని ఆందోళనతో.. చూస్తుండగానే ఐదేండ్ల చిన్నారి గొంతులోకి కత్తి దిగింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోయింది. తల్లి ఫేస్‌బుక్‌ పరిచయాలకు అభంశుభం తెలియని పసిపాప బలైపోయింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకొన్న ఘోరమిది. ఫేస్‌బుక్‌లో తల్లికి ఇద్దరితో ఉన్న పరిచయం చిన్నారికి ప్రాణాంతకంగా మారింది. ఆమె ఒకరితో చనువుగా ఉంటున్నదని తెలుసుకొన్న మరొకరు పనికిరాని ఆవేశంతో ఏకంగా కత్తితో ఇంటికి వచ్చి అమానుషానికి పాల్పడ్డాడు. చిన్నారిని హతమార్చి.. తల్లిని గాయపరిచి, ఆమెతో ఉన్న మరొకరిపైనా దాడిచేసి.. చివరకు తనకు తానుగా మెడను కోసుకున్నాడు.   

ఘట్‌కేసర్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇద్దరు యువకులతో సోషల్‌మీడియా ద్వారా ఒక మహిళకు ఏర్పడ్డ పరిచయం ఆమె బిడ్డ నిండుప్రాణాల్ని బలితీసుకున్నది. ఈ దారుణ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌ గూడ విహారి హోమ్స్‌లో గురువారం చోటుచేసుకున్నది. చిన్నారి హత్యకు తల్లి స్నేహాలే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇద్దరు యువకులతో పరిచయం

పోలీసుల వివరాల ప్రకారం.. భువనగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్‌ అనంతపురానికి చెందిన యువతితో సోషల్‌మీడియాలో పరిచయమైంది. వీరి పరిచయం ప్రేమగా మారి.. 2011లో వీరిద్దరు పెండ్లి చేసుకున్నారు. వీరికి 2015లో అమ్మాయి పుట్టింది. గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న పాప తండ్రి తన కుటుంబాన్ని రెండేండ్ల కిందట భువనగిరి నుంచి పోచారం ఇస్మాయిల్‌ఖాన్‌గూడకు మార్చాడు. ఆ సమయంలోనే అమ్మాయి తల్లికి సోషల్‌ మీడియాలో కరుణాకర్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొంతకాలానికి సోషల్‌మీడియా ద్వారానే రాజన్న సిరిసిల్లకు చెందిన మరో వ్యక్తితో కూడా ఆమెకు పరిచయం ఏర్పడింది. ముగ్గురు స్నేహితులుగా మారారు.

 రెండు నెలలనుంచి ఆమె కరుణాకర్‌ను దూరం పెట్టింది. దీంతో ఆమెపై అక్కసు పెంచుకున్న కరుణాకర్‌.. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని కోపం పెంచుకున్నాడు. పక్కా ప్లాన్‌తో కత్తి వెంటపెట్టుకుని ఇస్మాయిల్‌ఖాన్‌ గూడలోని ఆమె ఇంటికి వచ్చాడు. అప్పటికే సిరిసిల్లకు చెందిన యువకుడు.. ఆమె ఇంట్లో ఉన్నాడు. కరుణాకర్‌ వచ్చిన విషయాన్ని గమనించిన ఆమె.. ఆ యువకుడిని బాత్‌రూంలో దాచిపెట్టింది. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లో కూతురుతో కలిసి కూర్చున్నది. కరుణాకర్‌ నేరుగా బెడ్‌రూమ్‌లోకి వచ్చాడు. మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుండటంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అరుపులు కేకల మధ్యలోనే ఆమె.. కరుణాకర్‌తోపాటు తన కూతురునూ బెడ్‌రూమ్‌లో వదిలేసి బయటికొచ్చి గడియపెట్టింది. కరుణాకర్‌ ఆగ్రహంతో ‘తలుపు తీయకపోతే నీ కూతురును చంపేస్తా’ అని బెదిరించాడు. ఆ వెంటనే కత్తితో పాప గొంతుకోశాడు. అమ్మాయి పెద్దగా కేకలు వేయడంతో తల్లి గది లోపలికి పరిగెత్తుకెళ్లింది.

అప్పటికే పాప రక్తపుమడుగులో విగతజీవిగా పడిఉన్నది. కరుణాకర్‌.. ఆమెపై కూడా కత్తితో దాడిచేయడంతో పెద్దగా అరుస్తూ కుప్పకూలింది. ఘర్షణ తీవ్రం కావడంతో బాత్‌రూంలో ఉన్న యువకుడు బయటకు వచ్చాడు. వెంటనే అతనిపై కూడా కరుణాకర్‌ కత్తితో దాడి చేశాడు. తప్పించుకున్న యువకుడు గోడదూకి పారిపోయాడు. ఆ తర్వాత ఇంటి బయటకు వచ్చిన కరుణాకర్‌ అక్కడే గొంతు కోసుకుని నిలబడ్డాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతణ్ణి దవాఖానకు తరలించారు. తల్లికి ఇద్దరు యువకులతో ఏర్పడ్డ పరిచయానికి చిన్నారి బలైందని స్థానికులు కన్నీరు పెడుతున్నారు.


అదుపులో నిందితుడు, మరో యువకుడు

తల్లికి ఇద్దరు యువకులతో ఏర్పడ్డ స్నేహం కారణంగానే పాప హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాలు పెట్టిస్తానని కరుణాకర్‌తోపాటు మరో యువకుడిని ఆమె డబ్బు తీసుకుని తిప్పించుకోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడు కరుణాకర్‌తోపాటు సిరిసిల్ల యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. షాక్‌కు గురైన పాప తల్లిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షిత కే మూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి, ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ సందర్శించారు. 24 గంటల్లో కేసు మిస్టరీ వీడిపోతుందని రాచకొండ పోలీసులు తెలిపారు. కాగా, కరుణాకర్‌, మరో యువకుడు తరచూ ఇంటికి వచ్చేవారని, తనను అన్నా అని, తన భార్యను అక్కా అని పిలిచేవారని పాప తండ్రి చెప్పారు. తన బిడ్డను చంపేంత తప్పు తామేం చేయలేదని కన్నీరుపెట్టారు.


logo