ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:42

కొడుకును చంపి.. తల్లి ఆత్మహత్య

కొడుకును చంపి.. తల్లి ఆత్మహత్య

  • రెండు ప్రాణాలు తీసిన అవిటితనం 
  • మానసిక వేదనతోనే ఘాతుకం

మన్సూరాబాద్‌: ఆ తల్లి.. బాధను జయించలేక పోయింది.. అంధత్వం కూడా ఉన్న దివ్యాంగుడైన కొడుకును అపురూపంగా చూసుకోవాల్సిందిపోయి.. నిరాశకు లోనైంది. లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించినా బిడ్డ కోలుకోవడం లేదని మనోవేదన పెంచుకుంది. ఓ బలహీన క్షణంలో.. బిడ్డను అనంతలోకాలకు పంపి.. తాను భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ హృదయ విదారక ఘటన ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్‌, శాతవాహనగర్‌ కాలనీలోని ఓ భవనం మూడో అంతస్తులో నివాసముంటున్న శంకరయ్య, మమత దంపతులకు రియాన్స్‌ (3) అనే బాబు ఉన్నాడు. బాబుకు పుట్టుకతోనే దృష్టిలోపంతోపాటు మానసిక పరిపక్వత సరిగాలేదు. లక్షలు వెచ్చించి వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోయింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తలుచుకుని మమత తీవ్ర మనోవేదనకు గురయ్యేది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయాన్ని చూసి కుమారుడి చేతిమణికట్టు వద్ద బ్లేడుతో కోసి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న శంకరయ్య.. బెడ్‌రూంలో రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి భోరున విలపిస్తూ.. భార్యకోసం వెతికాడు. ఆమె కనిపించలేదు. దీంతో హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షిస్తుండగానే చిన్నారి కన్నుమూశాడు. ఈలోపు శంకరయ్య షాపులో పనిచేసే వికాస్‌గౌడ్‌తోపాటు స్థానికులు మమత కోసం వెతకసాగారు. పెంట్‌హౌజ్‌ పైన ఉన్న వాటర్‌ ట్యాంక్‌ పక్కన మమత ఉన్నట్టు గ్రహించిన సదరు యువకుడు ‘అక్కా.. అక్కా’ అని పిలుస్తుండగానే.. ఆమెపై కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నది. మనుమడు రియాన్స్‌కు దృష్టిలోపంతోపాటు మానసిక పరిపక్వత లేకపోవడంతో తన కూతురు తీవ్ర మనోవేదనతో కొడుకును హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తండ్రి నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.logo