గురువారం 09 జూలై 2020
Telangana - Apr 06, 2020 , 02:34:55

యువత పైనే పంజా!

యువత పైనే పంజా!

-దేశంలో కరోనా బాధితుల్లో అత్యధికం యువకులే

-పాజిటివ్‌ కేసుల్లో 60శాతం 20-49 ఏండ్ల మధ్యవారే

-మొత్తం కేసుల్లో పురుషులు 73 శాతం

-యువత నిర్లక్ష్యం వీడాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మేము యువకులం.. కరోనా మమ్మల్ని ఏమీ చేయదు’ అని నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రభుత్వం, వైద్యుల మాటలు పెడచెవిన పెట్టి ఇష్టారీతిగా తిరుగుతున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. మీ నిర్లక్ష్యం కరోనా వైరస్‌ వ్యాప్తికి ఆసరాగా నిలుస్తున్నది. మన దేశంలో కరోనా కాటు యువతరంపైనే ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్‌ 2వ తేదీ వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 60శాతం కంటే ఎక్కువగా.. 20 నుంచి 49 ఏండ్ల వయస్సువారే ఉన్నారు. ఇందులో 20-39 మధ్య వారు 43%, 40-49 వయస్కులు 17% దాకా ఉన్నారు. ఈ విషయాన్ని ఇండియా టుడే డాటా ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (డీఐయూ) వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, మన దేశంలో యువతకే కరోనా ఎక్కువగా సంక్రమిస్తున్నట్టు తెలుస్తున్నది. చైనా, ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో కరోనా వైరస్‌ ఎక్కువగా పెద్ద వయస్సు వారికి సంక్రమిస్తుండగా.. మన దేశంలో యువతలో ఎక్కువగా కనిపిస్తున్నది. మన దగ్గర నమోదైన పాజిటివ్‌ కేసుల్లో వయోధికుల సంఖ్య తక్కువగా ఉండటం గమనించవచ్చు. 60 ఏండ్లకు పైబడిన వారు 19 శాతం ఉండగా, 80 ఏండ్లు దాటిన వారు 2 శాతం కంటే తక్కువగా ఉన్నారు.  ఇక 10 ఏండ్ల కంటే తక్కువ వయసున్నవారు 3 శాతం ఉన్నారు.

పాజిటివ్‌ కేసుల్లో పురుషులే అధికం

కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో 73 శాతం పురుషులు, 27 శాతం మహిళలు ఉన్నారు. మహిళల్లో కూడా యువతులే ఎక్కువగా ఉండటం గమనార్హం. పాజిటివ్‌ కేసులు నమోదైనవారి మహిళల్లో ఎక్కువగా 20 నుంచి 29 వయస్సువారు ఉన్నారు. పురుషులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.  

యువ భారత్‌..

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో 15-60 ఏండ్ల మధ్య వయస్కులు అధికం. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 0-15 ఏండ్ల మధ్య వయస్కులు 29.5 శాతం, 15-59 మధ్య వయసువారు 62.5 శాతం, 60 ఏండ్లు పైబడిన వారు 8 శాతం ఉన్నారు. ఇదే ఇటలీలో అయితే మొత్తం జనాభాలో 65 ఏండ్లు పైబడిన వారు దాదాపు పావు వంతు ఉన్నారు. చైనాలో 11 శాతం మంది వృద్ధులే. స్టాటిస్టా.కామ్‌ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకినవారిలో 72 శాతం మంది 50 ఏండ్లు పైబడినవారే. అయితే మనదేశంలో మాత్రం వైరస్‌ బాధితులు యువతే అధికంగా ఉండడం గమనార్హం. కానీ మృత్యువాతపడిన వారు 60 ఏండ్లు పైబడినవారే. 

కొంప ముంచుతున్న నిర్లక్ష్యం

మనదేశంలో యువత ఇప్పటికీ తమకు కరోనా వైరస్‌ సోకదనే అపోహలో ఉన్నారని, ఈ నిర్లక్ష్యమే మన కొంప ముంచుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ పూర్తిస్థాయిలో సహకరించకుండా రోడ్లపై సంచరిస్తుండటం వల్ల వైరస్‌కు వాహకంగా మారి ప్రమాదం కొనితెచ్చుకొంటున్నారని హెచ్చరిస్తున్నారు. వయస్సు, లింగభేదంతో సం బంధం లేకుండా వైరస్‌ సంక్రమించే అవకాశం ఉన్నదని, తప్పనిసరిగా తరుచూ చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లను ఉపయోగించం, ఇంట్లోనే ఉండటం, నిర్ణీత దూ రం పాటించడం వంటి చర్యలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. 


logo