శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 01:04:55

జలుబు.. కరోనా.. ఇదీ తేడా!

జలుబు.. కరోనా.. ఇదీ తేడా!

మన శరీరంలోకి ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్‌ ప్రవేశిస్తే.. అది అభివృద్ధి చెందిన తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి.  ఏ ఇన్ఫెక్షన్‌ అయినా వ్యాధి లక్షణాలు మొదలైన తర్వాత ఇంకొకరికి వ్యాపిస్తుంది. కరోనా అలాకాదు. కొవిడ్‌-19 లక్షణాలు కనిపించకపోయినప్పటికీ.. శరీరంలో కరోనా వైరస్‌ ఉంటే అది మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే కనికాకపూర్‌ లాంటివాళ్లకు తొలి పరీక్షలో నెగెటివ్‌ రిపోర్టు వచ్చినప్పటికీ ఆ తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించి, పాజిటివ్‌గా బయటపడుతున్నది. అంటే కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ ఉన్నవాళ్లు ఏ లక్షణాలూ లేకపోయినా ఆ వ్యాధిని ఇతరులకు సంక్రమింపజేస్తారు.

కరోనా ఇన్ఫెక్షన్‌లో చాలావరకు జలుబు ఉండదు

కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారిలో దగ్గు, జ్వరం, ఆయాసం ముఖ్యమైన లక్షణాలుగా ఉంటాయి. తొలుత జ్వరం, దగ్గుతో ప్రారంభమై.. న్యుమోనియా ఎక్కువైతే ఆయాసం కూడా వస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. కరోనా ఇన్ఫెక్షన్‌లో జలుబు చాలావరకు ఉండదు. జలుబు ఉంటే ముక్కు దిబ్బడ, ముక్కుకారడం లాంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. దగ్గు, ఆయాసం ఉండవు. సాధారణ జలుబు వల్ల జ్వరం ఉండదు. జలుబుతోపాటు జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటే ఫ్లూ అవుతుంది. తర్వాత నెమ్మదిగా దగ్గు మొదలవుతుంది. కరోనా వైరస్‌ సోకినవారిలో వ్యాధి లక్షణాలు కనిపించేందుకు 2 నుంచి 14 రోజులు పడుతుంది. అంటే కొవిడ్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 2 నుంచి 14 రోజులన్నమాట. అయితే చాలామందికి 5వ రోజున, కొందరికి 14వ రోజున ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

ఎప్పుడు భయపడాలి?

విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే కరోనా ఇన్ఫెక్షన్‌ ఉంటున్నట్టు తెలంగాణలో బయటపడుతున్నది. ఇప్పటివరకు ఇక్కడివారెవరికీ కరోనా పాజిటివ్‌ రాలేదు. అంటే ఇక్కడి వాళ్లకు ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్‌ వ్యాపించడంలేదు. విదేశాల నుంచి వచ్చినవారితో కాంటాక్ట్‌ అయినప్పటికీ ఇక్కడివాళ్లెవరికీ పాజిటివ్‌ రాలేదు. కాబట్టి ఇక్కడే ఉన్నవారిలో జలుబు, ఫ్లూ కనిపించినా భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదు. ఇలాంటివారిలో 50 శాతం వరకు వ్యాధి లక్షణాలు వాటంతట అవే తగ్గేందుకు ఆస్కారమున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడికీ వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండటం మేలు. రెండు వారాలైనా వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టకపోతే వెంటనే వైద్యుని సలహా తీసుకోవాలి. 104 టోల్‌ఫ్రీ నంబర్‌కి కాల్‌ చేయడంగానీ, గాంధీ, ఉస్మానియా, చెస్ట్‌ లాంటి దవాఖానలకు వెళ్లడంగానీ చేయాలి. విదేశాల నుంచి వచ్చినవారిలో ఏమాత్రం లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా స్వీయనిర్బంధంలో ఉండటం మంచిది.


logo