ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:34:52

యాసంగి సాగు ఇలా

యాసంగి సాగు ఇలా

  • సూర్యాపేట జిల్లాలో అధికంగా 4.41 లక్షల ఎకరాల్లో వరి 
  • వరి, వేరుశనగ, శనగ పంటలకు ప్రాధాన్యం 
  • నాగర్‌కర్నూల్‌లో వేరుశనగ.. ఆదిలాబాద్‌లో శనగ 
  • క్లస్టర్లవారీగానూ పంటల సాగు ఖరారు
  • జిల్లాలవారీగా వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి సీజన్‌కు నిర్ణీత పంటల సాగు ఖరారైంది. జిల్లాలవారీగా సాగుచేయాల్సిన పంటలను వ్యవసాయశాఖ నిర్ణయించింది. యాసంగిలోనూ మక్కను పక్కకు పెట్టి.. వరి, పల్లీ, శనగ సాగుకు ప్రాధాన్యమిచ్చింది. మొత్తం 65.69 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రతిపాదించగా.. ఇందులో ఈ మూడు పంటల సాగు విస్తీర్ణమే 58 లక్షల ఎకరాలకుపైగా ఉన్నది. సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో అత్యధికంగా వరికి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పల్లీ, ఆదిలాబాద్‌ జిల్లాలో శనగ ఎక్కువగా సాగుచేయాలని సూచించింది. యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరిని అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 4.41 లక్షల ఎకరాలో.. తర్వాత నల్లగొండలో 4.04, నిజామాబాద్‌లో 3.83 లక్షల ఎకరాల్లో సాగుకు సూచించింది. వరి తర్వాత శనగ పంటను 4.50 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. ఈ పంటను అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 92,880 ఎకరాల్లో, నిర్మల్‌ జిల్లాలో 84 వేలు, కామారెడ్డి జిల్లాలో 80 వేల ఎకరాల్లో సాగుచేయాలని నిర్ణయించింది. పల్లీని 3,99,680 ఎకరాల్లో వేయాలని ప్రణాళికలు రూపొందించింది. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 1.33 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. తర్వాత వనపర్తిలో 49,984, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 35 వేల ఎకరాల్లో సాగుచేయాలని సూచించింది. 


జిల్లాలవారీగా ప్రాధాన్య పంటలు

వరి 

సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి. 

శనగ

ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి. 

పల్లీ

నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, వరంగల్‌ రూరల్‌. 


logo