న్యూయార్క్: అమెరికాకు చెందిన యునైటెడ్ విమాన సంస్థ 15 సూపర్ సోనిక్ విమానాలను ఖరీదు చేయనున్నది. 2029 నాటికి ప్రయాణికులను తరలించేందుకు ఆ సంస్థ సూపర్సోనిక్ విమానాలను వాడనున్నది. సూపర్సోనిక్ విమానాలు ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణిస్తాయి. ఎయిర్‌ఫ్రాన్స్, బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన కాంకర్డ్ సూపర్ సోనిక్ విమానాలు 2003లోనే రద్దు అయ్యాయి. అయితే కొత్త రకం ఓవర్‌ట్యూర్ విమానాలను తయారు చేయనున్నారు. డెన్వర్ కు చెందిన బూమ్ కంపెనీ ఈ కొత్త సూపర్ సోనిక్ విమానాలను తయారు చేస్తున్నది.
సుమారు 60 వేల ఫీట్ల ఎత్తులో సూపర్ సోనిక్ విమానం దాదాపు 1060 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది. సాధారణ జెట్ విమానం గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. కొత్త సూపర్ సోనిక్ విమానం వల్ల చాల సమయం ఆదా అవుతుంది. లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు సగం సమయం తగ్గుతుంది. కేవలం మూడున్నర గంటల్లో లండన్ నుంచి న్యూయార్క్ చేరుకోవచ్చు. కానీ గతంలో కాంకర్డ్ విమానాలు గంటకు 1350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేవి.