మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 20, 2020 , 02:07:04

వరదకాల్వకు ఒక టీఎంసీ

వరదకాల్వకు ఒక టీఎంసీ
  • పునర్జీవ పథకం ద్వారా నీటి విడుదలకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • ఎల్లంపల్లి పరిధిలో ఐదు లిఫ్టులను ఆన్‌ చేయాలని నిర్దేశం
  • ఉమ్మడి కరీంనగర్‌లోని 180కి పైగా చెరువులకు జలకళ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకంద్వారా వరదకాల్వలోకి ఒక టీఎంసీ నీటిని విడుదలచేయాలని ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్‌రావు బుధవారం నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. వరదకాల్వలోకి నీటిని విడుదల చేసేందుకు ఎస్సారెస్పీలో తగిన నిల్వలు లేనందున ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారని కరీంనగర్‌ ఉమ్మడిజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. వరదకాల్వకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా నీటిని విడుదలచేయాలని అధికారులకు సూచించారు. 


సీఎం ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తామని కరీంనగర్‌ ఈఎన్సీ అనిల్‌కుమార్‌ తెలిపారు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలకు యాసంగి పంటకు సరిపడ సాగునీరందనున్నది. ప్రస్తుతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం మీదుగా ఎల్‌ఎండీకి నీటి విడుదల కొనసాగుతున్నది. నంది, గాయత్రీ పంపుహౌజుల్లోని భారీ మోటర్ల ద్వారా ఎత్తిపోత జరుగుతున్నది. వరదకాల్వ ద్వారా ఎలాగూ శ్రీరాజరాజేశ్వర జలాశయానికి జలాలు తరలుతున్నందున ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరదకాల్వలోఎగువకు నీటిని ఎత్తిపోయనున్నారు. దీనికోసం పునర్జీవ పథకంలో భాగంగా నిర్మించిన రాంపూర్‌, రాజేశ్వరరావుపేట పంపుహౌజుల్లో మూడు చొప్పున మోటర్లను ఆన్‌చేస్తారు. రాంపూర్‌ పంపుహౌజ్‌ ద్వారా ఎత్తిపోసిన జలాలు వరదకాల్వ 34 కిలోమీటర్‌ వరకు అందుబాటులోకి వస్తాయి. 


ఆ తర్వాత రాజేశ్వరరావుపేట పంపుహౌజ్‌ ద్వారా ఎత్తిపోసిన నీటితో వరదకాల్వ మొదటి పాయింట్‌ వరకు నీరు చేరుతుంది. దీంతో వరదకాల్వపై ఉన్న ఓటీల ద్వారా నీటిని విడుదలచేసి దాదాపు 50 చెరువులను నింపుతారు. తద్వారా బాల్కొండ, జగిత్యాల, వేములవాడ, ధర్మపురి, కరీంనగర్‌ నియోజకవర్గాల పరిధిలో యాసంగికి సాగునీరు అందుతుంది. అదేవిధంగా ఎల్లంపల్లి ఫోర్‌షోర్‌, దానికి అనుసంధానంగా ఉన్న ఐదు లిప్టుల ద్వారా నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన దరిమిలా అధికారులు ఆ ప్రక్రియను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నీటి విడుదల ద్వారా మరో 130 చెరువులకు పైగా జలకళ రానున్నది. తద్వారా చొప్పదండి, ధర్మపురి, వేములవాడ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందనుందని ఈఎన్సీ అనిల్‌కుమార్‌ తెలిపారు. 


logo