బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:17

కేబుల్‌ బ్రిడ్జికి మరిన్ని హంగులు

కేబుల్‌ బ్రిడ్జికి మరిన్ని హంగులు

  • రూ.3.50 కోట్లతో డైనమిక్‌ లైటింగ్‌
  • మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌కు పర్యాటక శోభ తీసుకువచ్చే కేబుల్‌ బ్రిడ్జిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామ ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇందుకోసం బ్రిడ్జికి డైనమిక్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, టాటా ప్రాజెక్టు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. మానేరు వాగుపై నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జికి రూ.3.50కోట్ల వ్యయంతో డైనమిక్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతోపాటు రెండు అండర్‌పాస్‌ వంతెనలను కూడా నిర్మిస్తామని తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి పనులు తుది దశకు వచ్చాయని, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. భూసేకరణ పూర్తిచేసి పనులను దసరా నాటికి పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్‌ నుంచి ఎలగందుల పాత రోడ్డు పనులకు రీ-టెండర్‌ నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ రవీందర్‌రావు, ఎస్‌ఈ రాఘవచార్యులు, డీఈ శ్రీనివాస్‌, ఏఈలు పాల్గొన్నారు.


logo