శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 02:06:59

మరిన్ని జాతీయ రహదారులు

మరిన్ని జాతీయ రహదారులు

 • రాష్ట్రంలో 14 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
 • రూ.13,169 కోట్ల వ్యయం.. 765 కిలోమీటర్ల పొడవు
 • నవభారత నిర్మాణమే లక్ష్యం: కేంద్ర మంత్రి గడ్కరీ
 • తెలంగాణలో రహదారుల అభివృద్ధికి సహకరించండి
 • కేంద్రానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వినతి

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో రూ.13 వేల కోట్లకు పైగా విలువగల జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. వర్చువల్‌ విధానంలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ నుంచి పాల్గొన్న కేంద్ర మంత్రి ఆరు రహదారులను ప్రారంభించి, మరో ఎనిమిది హైవేలకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.13,169 కోట్ల వ్యయంతో 765.66 కిలోమీటర్ల పొడవున ఈ రహదారులను చేపట్టారు. వీటిలో రూ.3,717 కోట్ల వ్యయంతో 370 కి.మీ పొడవున నిర్మించిన ఆరు జాతీయ రహదారులు ఉండగా, రూ.9,440 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 396 కిలోమీటర్ల పొడవైన ఎనిమిది హైవే లు ఉన్నాయి. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. నవ భారత నిర్మాణంలో భాగంగా దేశంలో ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణలో 14 జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో రాష్ట్రంలో జాతీయ రహదారులు 2,511 కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం 3,910 కిలోమీటర్లకు పెరిగాయని చెప్పారు. పెద్దపల్లి మినహా రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయని తెలిపారు. పెద్దపల్లిని కూడా త్వరలోనే కలుపుతామని చెప్పారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పూర్తిచేసిన యాదాద్రి-వరంగల్‌ హైవే ప్రాజెక్టును ప్రారం భించడం పట్ల గడ్కరీ సంతోషం వ్యక్తంచేశారు. దాదాపు రూ.1,890 కోట్ల వ్యయంతో సుమారు 99 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టు తెలంగాణలోని రెండు ప్రముఖ నగరాలైన హైదరాబాద్‌, వరంగల్‌ను కలుపుతుందన్నారు. భూమి పూజ జరిగిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున లబ్ధిచేకూరుతుందని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌-ఔరంగాబాద్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగమైన కంది నుంచి రాంసానిపల్లి, రాంసానిపల్లి గ్రామం నుంచి మంగ్లూర్‌ వరకు ఎన్‌హెచ్‌-161పై నాలుగు లేన్ల ప్రాజెక్టులు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వేగంగా సరుకు రవాణాకు దోహదపడుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో రేపల్లెవాడ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వరకు, మంచిర్యాల నుంచి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు వరకు, నాగపూర్‌-విజయవాడ ఆర్థిక కారిడార్లు భాగంగా ఉన్నాయి. 

జాతికి అంకితం చేసిన రోడ్లు 

 • యాదాద్రి- వరంగల్‌ (99 కి.మీ - రూ.1,889 కోట్లు) 
 • నకిరేకల్‌ -తానంచెర్ల రెండు లైన్లు (66 కి.మీ - రూ.605 కోట్లు )
 • ఓఆర్‌ఆర్‌-మెదక్‌ (62 కి.మీ -రూ. 426 కోట్లు)
 • మన్నెగూడ- రావులపల్లి రెండులైన్లు (72 కి.మీ -రూ. 359 కోట్లు)
 • ఆత్మకూరు- పస్ర రెండులైన్లు (34 కి.మీ -రూ.230 కోట్లు)
 • మహాదేవ్‌పూర్‌- భూపాలపల్లి రెండులైన్లు (33 కి.మీ -రూ.206 కోట్లు) 

శంకుస్థాపన చేసిన 8 జాతీయ రహదారులు 

1. సూర్యాపేట - ఖమ్మం (58.62 కి.మీ -రూ. 2,054 కోట్లు)

2. మంచిర్యాల -రేపల్లెవాడ  ( 42 కి.మీ -రూ.1,556 కోట్లు )

3. రాంసాన్‌పల్లి - మంగ్లూర్‌  (46.808 కి.మీ రూ.1,551 కోట్లు)

4. కంది -రాంసాన్‌పల్లి (39.98 కి.మీ - రూ.1,304 కోట్లు)

5. మంగ్లూర్‌ -తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు  (48.96 కి.మీ -రూ. 1,247 కోట్లు)

6. రేపల్లెవాడ- తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు  (52.602 కి.మీ - రూ.1,226 కోట్లు)

7. నకిరేకల్‌ - నాగార్జునసాగర్‌  (85.45 కి.మీ - రూ.369 కోట్లు )

8. కంకాపూర్‌-ఖానాపూర్‌ రెండులైన్ల రోడ్డు  ( 21.10 కి.మీ- రూ.141 కోట్లు)

తెలంగాణకు మరింత సహకరించాలి: వేముల

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ నుంచి పాల్గొన్న రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో మెరుగైన రహదారి సదుపాయాలను కల్పించేందు కు కేంద్రప్రభుత్వం మరింత సహకారం అందించాలని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25 రాష్ట్ర రహదారుల శ్రేణికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. అందులో భాగంగా 3,135 కిలోమీ టర్ల పొడవున కొత్తగా జాతీయ రహదారులను ఏర్పాటు చేస్తామన్నారని, కానీ ఇప్పటివరకు 1,366 కిలోమీటర్లు మాత్రమే వేశారని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం దేశీయ సగటులో చాలా తక్కువగా ఉన్నదని చెప్పారు. తెలంగాణలో కనీసం 1000 కిలోమీటర్ల మేర కొత్త ఎన్‌హెచ్‌లను వేయాల్సిన అవసరముందని తెలిపారు. రాష్ట్రంలో 14 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసినందుకు కేంద్రప్రభుత్వానికి ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, వీకే సింగ్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహిళా,శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎన్‌హెచ్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.logo