బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 02:41:32

ఈవోడీబీలో మరిన్ని సంస్కరణలు

ఈవోడీబీలో మరిన్ని సంస్కరణలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యువతకు ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టిన రాష్ట్రప్రభుత్వం సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. ఈవోడీబీలో తాము చేపట్టనున్న సంస్కరణలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈవోడీబీ -2020 సంస్కరణలపై బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈవోడీబీ సంస్కరణల కోసం వివిధ శాఖల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై వారితో చర్చించారు. న్యాయశాఖ, పర్యాటకశాఖ, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, పౌరసరఫరాలశాఖ, ఎక్సైజ్‌, సీసీఎల్‌ఏ తదితర శాఖల కార్యదర్శులకు మంత్రి కేటీఆర్‌ వివరాలు అందచేశారు. ఆ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై పలు సలహాలు, సూచనలు చేశారు. కొన్ని సంస్కరణలను ఒక నెలలో పూర్తిచేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ దిశగా వేగంగా పనిచేయాలని కేటీఆర్‌ ఆయా శాఖల అధిపతులను ఆదేశించారు. ఈ సంస్కరణల ద్వారా వివిధ శాఖల సేవల్లో గణనీయమైన సానుకూల మార్పులు వస్తాయన్నారు. దీంతోపాటు ప్రజలకు ఏ సేవ అయినా ఒకే చోట అందించేలా సిటిజన్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ను రూపొందించాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో చర్చించారు. దీనిద్వారా ఏ సేవనైనా నేరుగా ఆన్‌లైన్‌లో అందుకునే అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు. ఆయా శాఖలు చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటుచేస్తే వాటిని పర్యవేక్షించేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు. 

సమన్వయం అవసరం

టీఎస్‌బీపాస్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా పౌరులకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా భవననిర్మాణ అనుమతులు, లే అవుట్ల అనుమతులు ఇస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఎస్‌బీపాస్‌ చారిత్రాత్మక చట్టమని, దీని అమలులో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరమని చెప్పారు. ఆ దిశగా ఇప్పటినుంచి ఆయా శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌బీపాస్‌ అమలుపై మంత్రి కేటీఆర్‌ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఇది ఇప్పటికే చట్టంగా రూపొందిందని పేర్కొంటూ.. దాని అమలుకు సంబంధించిన కార్యక్రమాలపై వివిధ శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్‌ పలు సలహాలు ఇచ్చారు. టీఎస్‌బీపాస్‌ అనుమతులతో సంబంధముండే ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్‌ ఆఫీసర్‌ను ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. త్వరలోనే శాఖలన్నింటి సమన్వయం, సహకారంతో క్షేత్రస్థాయిలో టీఎస్‌బీపాస్‌ అమలుచేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో వివిధశాఖల ముఖ్య కార్యదర్శులు రజత్‌కుమార్‌, రాణి కుముదిని, అర్వింద్‌కుమార్‌, జయేశ్‌రంజన్‌, జనార్దన్‌రెడ్డి, వికాస్‌రాజ్‌, సునీల్‌శర్మ, సందీప్‌కుమార్‌ సుల్తానియా, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.


logo